సర్‌గమ్‌ షూటింగ్‌ గోదారి తీరానే..

1 May, 2020 13:22 IST|Sakshi
రాజమహేంద్రవరం వచ్చిన రిషీకపూర్, ఎన్‌ఎన్‌ సిప్పీలతో జిత్‌మోహన్‌ మిత్రా

బాలీవుడ్‌ హీరో రిషీకపూర్‌కు రాజమండ్రితో అనుబంధం

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం కల్చరల్‌:  అలనాటి హిందీ రొమాంటిక్‌ హీరో హిందీ నటుడు రిషీకపూర్‌ ఇక లేరన్న వార్త గోదావరి తీర కళాభిమానుల్లో  విషాదాన్ని నింపింది. ‘హమ్‌ తుమ్‌ ఏక్‌ కమరేమే బంద్‌హో’ అంటూ డింపుల్‌ కపాడియాతో కలిసి యువతరం గుండెల్లో అలజడి లేపారు. రిషీకపూర్‌ 1979లో కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో సర్‌గమ్‌ (సిరిసిరిమువ్వహిందీ వెర్షన్‌) షూటింగ్‌ రాజమహేంద్రవర పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఒక్కో షెడ్యూల్‌లో 20 రోజుల చొప్పున, రెండు షెడ్యూళ్లలో, మొత్తం 40 రోజుల్లో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రిషికపూర్‌ రాజమండ్రిలోని నాటి ప్రసిద్ధ హోటల్‌ అప్సరాలో బస చేశారు. తెలుగులో సిరిసిరిమువ్వలాగే, హిందీలో సర్‌గమ్‌ కూడా ఘన విజయం సాధించడం, తెలుగు సినిమా చిత్రీకరణ జరుపుకున్న లొకేషన్లలోనే హిందీ సినిమా షూటింగ్‌ జరుపుకోవడం విశేషం.(వైర‌ల‌వుతున్న రిషి కపూర్ వీడియో)

‘‘ఆయన ఎంతో ఆత్మీయంగా మెలిగే వారు. ఈ చిత్రంలో రాజమండ్రికే చెందిన జయప్రద హీరోయిన్‌. సర్గమ్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో, నేను రాజమండ్రి అప్సరా హోటల్‌లో హీరో రిషీకపూర్, నిర్మాత ఎన్‌.ఎన్‌.సిప్పీలను కలుసుకున్నాను. గోదావరి అందచందాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని రిషీకపూర్‌ అన్నారు. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు. – శ్రీపాద జిత్‌మోహన్‌ మిత్రా, నటుడు, గాయకుడు

మరిన్ని వార్తలు