బాలీవుడ్ హీరోకు అది నచ్చలేదట!

6 Apr, 2016 15:57 IST|Sakshi
బాలీవుడ్ హీరోకు అది నచ్చలేదట!

ముంబై:  బిహార్ లో సంపూర్ణ నిషేధం విధించడంపై బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  బిహార్ ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయాన్ని  తీవ్రంగా ఖండించిన ఈ  విలక్షణ నటుడు సోషల్ మీడియాలో  తన భావాలను పంచుకున్నారు.  వరుస ట్విట్లతో ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పై  విమర్శలు గుప్పించారు.  వేల కోట్ల  రూపాయల రెవెన్యూ నష్టపోవడం తప్ప, మద్య నిషేధం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని  ఆయన ట్విట్ చేశారు.

'' మీరు చట్టవ్యతిరేక మరియు అక్రమ మద్యం ప్రోత్సహిస్తున్నారు. మద్య నిషేధం ప్రపంచవ్యాప్తంగా విఫలమైంది. వేక్ అప్ ! మీరు కూడా 3వేల కోట్ల రెవెన్యూ నష్టపోతారు, "  అంటూ రిషి ట్వీట్ చేశారు. "మద్యం సేవిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష ! అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు  ఐదు సంవత్సరాలా?   వహ్ నితీష్'  అని కమెంట్  పోస్ట్ చేశారు. ఒక పక్క  ధూమపానం,  మద్యం సేవించడం  ప్రమాదకరం...ప్రజలారా దయచేసి వీటినుంచి దూరంగా ఉండమని సలహా యిస్తూనే ....కూలి చిత్రంలో నటిస్తున్న రోజులనుంచి మద్యం  సేవిస్తున్నానంటూ 1983 చిత్రం " కూలి "  మూవీలోని  ఒక ఫోటోను  షేర్ చేశారు.
 
 కాగా మంగళవారం రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నట్టు  సీఎం నితీష్ ప్రకటించారు.  దేశంలో  మద్యం అమ్మకాలను నిషేధించిన రాష్ట్రాలలో గుజరాత్ , మణిపూర్, నాగాలాండ్ తర్వాత  ఈ కోవలో నాలుగవదిగా  బిహార్ అవతరించింది.