ఫొటోషూట్‌.. హీరో క్షమాపణలు

6 Jul, 2018 18:20 IST|Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ మరాఠా ప్రజలకు క్షమాపణ చెప్పారు. తనకు ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే... చారిత్రక ప్రదేశాల నవలా రచయిత విశ్వాస్‌ పాటిల్‌, ఫిల్మ్‌ ప్రొడ్యూసర్ రవి జాదవ్‌లతో కలిసి రితేశ్‌ గురువారం ముంబైలోని రాయ్‌గఢ్‌ ఛత్రపతి శివాజీ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహం ముందు రితేశ్‌ ఫొటోషూట్‌ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రితేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహం ముందు ఫొటోషూట్‌ ఎలా నిర్వహిస్తారు. అక్కడ ఫొటోలు దిగటం నిషిద్ధం. ఇదొక పనికిమాలిన చర్య’  అంటూ పలు సామాజిక సంస్థలు, నెటిజన్లు రితేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందుకు స్పందించిన రితేశ్‌.. ’ ఆయన(శివాజీ) పాదాల ముందు తలవంచి ఆశీస్సులు పొందాను. ఆయనకు పూల మాల వేశాను. ఎన్నో ఏళ్లుగా నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. ఆయన పట్ల గల భక్తి భావంతోనే అక్కడ ఫొటోలు దిగాను. అంతే తప్ప ఎవరి మనోభావాలో దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు. నా ఈ చర్య వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి’  అంటూ వివరణ ఇచ్చారు. కాగా రితేశ్‌ ఫొటోలపై స్పందించిన బీజేపీ ఎంపీ... ‘అక్కడ ఫొటోలు దిగటం నిషిద్ధం. ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. రితేశ్‌ చర్యను ఖండిస్తున్నా’  అంటూ మండిపడ్డారు.
 

>
మరిన్ని వార్తలు