మానవత్వం మరచిన తారలు

4 Apr, 2020 10:18 IST|Sakshi
ఆర్‌కే సెల్వమణి

సినిమా: నటీనటులకు మానవత్వం లేదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు, ప్రముఖ దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. అది ఇప్పుడు భారత దేశాన్ని కూడా కలవరపెడుతోంది. నానాటికీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. పాలకులు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు సినీ పరిశ్రమ కూడా అతీతం కాదు. ముఖ్యంగా దక్షణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు చెందిన సభ్యులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమాఖ్యలో 25 వేల మంది సభ్యులు ఉండగా, వీరిలో 18 వేల మంది రోజూవారీ వేతన కార్మికులే. వీరికి పనిచేస్తేగానీ పూట గడవని పరిస్థితి. దీంతో ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌.కె సెల్వమణి ఆర్థికసాయంతో ఆదుకోవాలంటూ సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తికి చాలా అతి కొద్దిమంది మాత్రమే స్పందించారు.

నటుడు శివకుమార్‌ కుటుంబం, నటుడు రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్‌ సేతుపతి, శివకార్తికేయన్‌ లాంటి అతి కొద్ది మంది మాత్రమే ఫెఫ్సీకి ఆర్థికసాయం అందించారు. ఇందులో రజనీకాంత్‌ మాత్రమే భారీగా రూ. 50 లక్షలను సాయం చేశారు. దీంతో ఇతర ప్రముఖ నటీనటులు ఫెప్సీకి సాయంపై స్పందించకపోవడంపై ఆర్‌కే సెల్వమణి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలా మొత్తం మీద ఇప్పటి వరకు ఫెఫ్సీకి రూ. 1.60 కోట్లు, 25 కేజీలతో కూడిన 1,983 బస్తాల బియ్యం అందాయి.  దీంతో సమాఖ్యలోని ఒక్కో సభ్యుడికి 25 కిలోల బియ్యం, రూ. 500 నగదు మాత్రమే సాయం చేయగలుగుతుందని,  ఇది వారి కుటుంబానికి ఏ మాత్రం సరిపోదని అన్నారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో నటీనటులు కోట్ల రూపాయల్లో ఆర్థికసాయం అందిస్తున్నారని తెలిపారు. అలాంటిది మన నటీనటులకు సాయం చేసే మానవత్వం లేకపోయిందని ఆర్‌కే సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు