ఫుట్ పాత్ లు ఉన్నది పడుకోవడానికా?

6 May, 2015 16:19 IST|Sakshi
ఫరా అలీ ఖాన్, అభిజిత్(ఫైల్)

ముంబై: సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో డిజైనర్ ఫరా అలీఖాన్, గాయకుడు అభిజిత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఫుట్ పాత్ లు ఉన్నది జనాలు నిద్రించడానికి కాదని అభిజిత్ ట్వీట్ చేశాడు. ఫుట్ పాత్ లపై ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యత డ్రైవర్లు లేదా మద్యానికి కాదని పేర్కొన్నాడు. ఆత్మహత్య నేరం, మరి ఫుట్ పాత్ లపై పడుకోవడం నేరం కాదా అని ప్రశ్నించాడు. 80 శాతం మంది నిరాశ్రయులు ఎంతో కష్టపడి బాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించారని వారెప్పుడూ ఫుట్ పాత్ లపై నిద్రించలేదని వ్యాఖ్యానించాడు.

'హిట్ అండ్ రన్'కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిజైనర్ ఫరా అలీఖాన్ ట్వీట్ చేశారు. పేదలను నిరాశ్రయులను చేయడం వల్లే వారు ఫుట్ పాత్ లపై పడుకుంటున్నారని తెలిపారు. నిరాశ్రయులు ఫుట్ పాత్ పై నిద్రించకుండా ఉంటే సల్మాన్ వారిపై కారు ఎక్కించేవాడు కాదని పేర్కొన్నారు. పట్టాలు దాటుతున్న వ్యక్తిపై రైలు పోనిచ్చినందుకు రైలు డ్రైవర్ ను శిక్షించిన చందంగా సల్మాన్ ఖాన్ కు శిక్ష విధించారని అన్నారు. రోడ్డు లేదా ఫుట్ పాత్ లపై ఎవరూ నిద్రించరాదని... ఇది రైలు పట్టాలు దాటడం లాంటిదని ఆమె వర్ణించారు.

అయితే తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆమె వివరణ ఇచ్చారు. పేదలను అవమానించడం తన ఉద్దేశం కాదని, పాలకుల చేతగాని తనాన్ని ఎద్దేవా చేశానని చెప్పారు. పేదలకు ఇళ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.  అభిజిత్ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. మనుషులు కుక్కల్లా ఫుట్ పాత్ లపై పడుకోరాదన్నదే తన ఉద్దేశమని వివరణయిచ్చాడు. తన దృష్టిల్లో ప్రతి మనిషి గౌరవింపదగిన వాడేనని చెప్పాడు.