ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ ఇదే..

3 Mar, 2020 19:52 IST|Sakshi

హైదరాబాద్‌ : మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి నిర్దేశకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ వర్కింగ్‌ టైటిల్‌ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు చిత్ర రూపకర్తలు త్వరలోనే తెరదించనున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రఘుపతి రాఘవ రాజారాం అని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల పాత్రల్లో రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు కనిపించనున్న ఈ మూవీకి ఈ టైటిల్‌ కచ్చితంగా సరిపోతుందని భావిస్తున్నారు.

బాలీవుడ్‌ దిగ్గజం అజయ్‌ దేవ్‌గన్‌, దేశీ బ్యూటీ అలియా భట్‌లు కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక అలియా భట్‌ త్వరలోనే చిత్రీకరణలో పాల్గొంటారని, ఆమె పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణతో దాదాపు మూవీ షూటింగ్‌ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇక వీఎఫ్‌ఎక్స్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. మరోవైపు చరణ్‌, తారక్‌ల ఫస్ట్‌ లుక్‌లను మార్చి 27, మే 20 తేదీల్లో వారి బర్త్‌డే రోజున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

చదవండి : ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జక్కన్న మరో మల్టీస్టారర్‌..!

మరిన్ని వార్తలు