ఆర్‌ఆర్‌ఆర్‌ ఓ అద్భుతం

7 Jul, 2020 01:19 IST|Sakshi
ఎన్టీఆర్‌, రాజమౌళి, రామ్‌చరణ్‌

కిలికి భాషతో సినిమా

రచయిత మదన్‌ కార్కీ

‘‘బాహుబలి’ సినిమాలో సినిమా రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు పది పైనే ఉంటాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో దాదాపు ప్రతి సీన్‌ అలానే ఉంటుంది. అంత అద్భుతమైన సినిమా’’ అంటున్నారు మదన్‌ కార్కీ. ‘బాహుబలి’ తమిళ వెర్షన్‌కి సంభాషణలు రాశారాయన. తాజాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (‘రణం, రుధిరం, రౌద్రం’) తమిళ వెర్షన్‌కి ఆయనే సంభాషణలు రాస్తున్నారు.

ఈ చిత్రం గురించి మదన్‌ కార్కీ మాట్లాడుతూ – ‘‘ఇంతకుముందు ఎప్పుడూ చూడని విజువల్స్‌ ఈ సినిమాలో ఉంటాయి. దేశభక్తికి సంబంధించిన సినిమా కావటంతో దాదాపు ప్రతి సీన్‌ కూడా కవితలా ఉంటుంది. రాజమౌళి కథలో డైలాగులు భారీగా ఉండవు. లెంగ్తీ డైలాగులకు ఆయన అంత ప్రాధాన్యం ఇవ్వరు. మాటలు చాలా చిన్నగా ఎంతో అర్థవంతంగా ఉంటాయి.  ఆయన చిత్రానికి నేను మాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ బడ్జెట్‌ సినిమా. ఇందులో పవర్‌ఫుల్‌ కథతో పాటు బలమైన భావోద్వేగాలు ఉంటాయి. మాటల రచయితగా ‘బాహుబలి’ సినిమా నాకో పెద్ద చాలెంజ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విషయానికొస్తే ఒక రచయితగా పెద్దగా చాలెంజ్‌ లేనట్లే.. కారణం ఇది పీరియాడిక్‌ ఫిల్మ్‌ కావడమే. ‘బాహుబలి’కి కిలికి భాష సృష్టించాం’’ అన్నారు. కిలికి భాష సృష్టికర్త మదన్‌ కార్కీయే. ఈ విషయం గురించి మదన్‌ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కిలికి భాషను వాడేవారు దాదాపు 40 మంది వరకు ఉన్నారు. వారందరూ దాదాపుగా నాకు టచ్‌లో ఉంటారు.

‘బాహుబలి’ కోసం 3000 మాటలతో నాలుగేళ్ల క్రితం రాసిన కిలికి భాష ఇప్పుడు 4000 మాటలతో వృద్ధి చెందింది. ప్రస్తుతం ఆ భాషతో చిన్న చిన్న కథలను కూడా రాస్తున్నారు చాలామంది. నేనేదైనా స్కూల్‌కి వెళ్లినప్పుడు ఈ భాషలో శిక్షణ ఇవ్వండి అని చాలామంది అడగడం ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. ఈ భాషతో సినిమా తీయటం కోసం కథ రెడీ చేశాను. కొందరు నిర్మాతలను కలిసి కిలికి భాషలో తయారైన కథ చెప్పాను. అందరూ బాగుందన్నారు. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన పూర్తి విశేషాలను తెలియజేస్తాను’’ అన్నారు.
 

మరిన్ని వార్తలు