ఆ గుళ్లోనే నా జీవితం మలుపు తిరిగింది

21 Jul, 2014 23:23 IST|Sakshi
ఆ గుళ్లోనే నా జీవితం మలుపు తిరిగింది

‘‘కమల్‌హాసన్‌తో పరిచయం నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది’’ అంటున్నారు సంగీత దర్శకుడు గిబ్రన్. ప్రస్తుతం ఆయన కమల్ ‘విశ్వరూపం-2’కు సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ హీరోగా ఆయన సంగీతం అందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారాయన. ‘విశ్వరూపం-2’ భారీ సీజీ వర్క్ ఉన్న సినిమా అనీ, అంతటి గొప్ప సినిమాకు సంగీతం అందించడం గర్వంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు.
 
 కమల్ ‘ఉత్తమ విలన్’ తర్వాతే ‘విశ్వరూపం-2’ విడుదల అవుతుందని గిబ్రన్ చెప్పారు. తాను స్వరాలందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం చాలా ఆసక్తికరంగా సాగే సినిమా అనీ, సంగీత దర్శకునిగా ఓ కొత్త అనుభూతిని ఈ సినిమా తనకు అందించిందని గిబ్రన్ అన్నారు. ‘‘సంగీత దర్శకుడు కాక ముందు నేను పియానో టీచర్‌ని. ఎంతో మంది పిల్లలకు పియోనో నేర్పిన అనుభవం నాది. సింగపూర్‌లో చదువుకున్నాను. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని చవిచూశాను. పులిహోర పోట్లాల కోసం గుడికెళ్లిన రోజులున్నాయి. ఆ గుళ్లోనే నా జీవితం మలుపుతిరిగింది. నా భార్య పరిచయమైంది అక్కడే.
 
 మా కలయిక స్నేహం నుంచి ప్రేమగా మారింది. తను విజయవాడ అమ్మాయి. సైంటిస్ట్. తన పరిచయం నాలో ఊహించని మార్పు తెచ్చింది. ఆమె తర్వాత నా జీవితంపై ప్రభావితం చేసిన మరో వ్యక్తి కమల్‌హాసన్‌గారు. ఆయన్ను కలవక ముందు కలిశాక నా జీవితాన్ని ఊహించుకుంటే... ఉద్వేగం కలుగుతుంది’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు గిబ్రన్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ అరడజను సినిమాల దాకా చేస్తున్నానని, సంగీత దర్శకునిగా కెరీర్ ఆశాజనకంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా