సినిమా రివ్యూ: రన్ రాజా రన్

1 Aug, 2014 17:25 IST|Sakshi
సినిమా రివ్యూ: రన్ రాజా రన్
నటీనటులు: శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, జయప్రకాశ్, అడివి శేషు, విద్యుల్లేఖ రామన్, కోట శ్రీనివాసరావు తదితరులు.
సంగీతం: జిబ్రాన్
కెమెరా: మధి
నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి
దర్శకత్వం: సుజిత్
 
ప్రస్థానం, జర్ని లాంటి చిత్రాలతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా దర్శకుడు సుజిత్ రూపొందించిన చిత్రం 'రన్ రాజా రన్'. కిడ్నాప్ డ్రామాకు ప్రేమ కథను జోడించి ఓ యూత్ ఫుల్ చిత్రంగా ప్రేక్షకులకు అందించిన 'రన్ రాజా రన్' ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 
 
హైదరాబాద్ నగరంలో ప్రముఖులు మాస్క్ ల పెట్టుకుని ఓ ముఠా వరుస కిడ్నాప్ లు సంచలనం సృష్టిస్తుంటాయి. కిడ్నాప్ ముఠాను పట్టుకునేందుకు దిలీప్ (సంపత్ రాజ్) అనే పోలీస్ కమిషనర్ కు కేసును అప్పగిస్తారు. కథ అలా సాగతుండగా అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. చాలా మంది అమ్మాయిలతో లవ్ బ్రేక్ ఆప్ లతో విసిగిపోయిన రాజా హరిశ్చందప్రసాద్ (శర్వానంద్)తో పోలీస్ కమిషనర్ కూతురు ప్రియ (సీరత్ కపూర్) ప్రేమలో పడుతుంది. రాజా, ప్రియల ప్రేమ వ్యవహారం తనకు నచ్చకపోయినా పోలీస్ కమిషనర్ ఒప్పకున్నట్టు నటిస్తాడు. ప్రియ నుంచి దూరం చేయడానికి రాజాను కిడ్నాప్ డ్రామా ఆడాలని ఓ కండిషన్ పెడుతాడు. ప్రియ ప్రేమ కోసం రాజా ఒప్పుకున్నట్టు నటించినా అసలు కారణం మరోకటి అనేది ఈ చిత్రంలో ఓట్విస్ట్. కిడ్నాప్ డ్రామా ఆడేందుకు రాజా ఎందుకు ఒప్పుకున్నాడు? రాజా కిడ్నాప్ వ్యవహారం సఫలమైందా? పోలీస్ కమిషనర్ దిలీప్ కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారా? కిడ్నాప్ లకు పాల్పడుతున్నది ఎవరు? అనే పలు సందేహాలను ప్రేక్షకులు కల్పించి దర్శకుడు చెప్పిన సమాధానాలే 'రన్ రాజా రన్'.
 
రాజా పాత్రలో శర్వానంద్ మంచి జోష్ ఉన్న యువకుడిగా కనిపించాడు. స్టైల్స్ తో శర్వానంద్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. స్టైల్స్ తోపాటు యాక్టింగ్ పరంగా కూడా మంచి ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యువ హీరోల పోటీలో శర్వానంద్ కు ఈ చిత్రం మరింత పేరు సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు. 
 
ప్రియగా కనిపించిన సీరత్ కపూర్ అందంతోనూ, అభినయంతోనూ మెప్పించింది. సీరత్ కపూర్ అందచందాలు కనువిందు చేశాయనే చెప్పవచ్చు. గ్లామర్ తారగా సీరత్ కపూర్ రాణించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సీరత్ గ్లామర్ అదనపు ఆకర్షణ. 
 
పోలీస్ కమిషనర్ గా సంపత్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనించాడు. శర్వానంద్ తండ్రిగా జయప్రకాశ్ ది ఓ ముఖ్యమైన పాత్రే. సంపత్, జయప్రకాశ్ లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. కోట శ్రీనివాసరావు పాత్ర రొటీన్ గానే ఉంది. 
 
టెక్నికల్: 
మిర్చి చిత్రానికి ఫొటోగ్రఫినందించిన మధి మరోసారి తన సత్తాను చూపించాడు. ఈ చిత్రంలో మధి అందించిన ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శర్వానంద్, సీరత్ కపూర్ లను గ్లామర్ గా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ లోను కలర్స్ వినియోగించిన తీరు బాగుంది. యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లను తెరకెక్కించిన విధానం 'రన్ రాజా రన్'కు హైలెట్ నిలుస్తాయని చెప్పవచ్చు. రాజ్ సుందరం అందించిన కోరియోగ్రఫీ పాటలకు మరింత ట్రేండిగా మార్చాయి. 
 
కిడ్నాప్ కథ బ్యాక్ డ్రాప్ గా 'రన్ రాజా రన్'ను ఓ అందమైన ప్రేమ కథగా మలచడంలో దర్శకుడు సుజీత్ కొంతమేరకు సఫలమయ్యాడనే చెప్పవచ్చు. అయితే కథనంలో వేగం మందగించడం కారణంగా మధ్య, మధ్యలో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కోసమే కథను సా...గదీశాడా అనే కోణం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తెలుగు, తమిళ, హిందీ హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల మాస్క్ లతో వెరైటీగా కిడ్నాప్ ముఠాను దర్శకుడు వెరైటీగా డిజైన్ చేసిన తీరు ప్రశంసనీయం.  చిత్ర ఫస్టాఫ్, సెకండాఫ్ లో నిడివి ఎక్కువగా ఉండటం వలన కథలో వేగానికి కళ్లెం వేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. చిత్ర నిడివిని తగ్గించడానికి ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించింది. ప్రమోద్, కృష్ణారెడ్డిల నిర్మాణాత్మక విలువులు బాగున్నాయి.