లీగల్‌ చర్యలకు సిద్ధం: ట్వింకిల్‌ ఖన్నా

30 Apr, 2018 10:10 IST|Sakshi

సాక్షి, ముంబై: నటి, బాలీవుడ్‌ అగ్రహీరో అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా లీగల్‌ చర్యలకు సిద్ధమైపోయింది. రుస్తుం సినిమాలో అక్షయ్‌ ధరించిన దుస్తులను వేలానికి ఉంచిన విషయం తెలిసిందే. ఈ సంగతి తెలిసిన ఓ అధికారి ట్వింకిల్‌ ఖన్నాకు ట్వీటర్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ‘నీ భర్త సినిమాలో ధరించిన కాస్టూమ్‌ మాత్రమే. అది యూనిఫామ్‌ కాదు. సైనికాధికారుల భార్యలు తమ భర్తల దుస్తులను వేలం వేయాలని చూడరు. అది చాలా గౌరవంతో కూడుకున్నది...

ఒకవేళ యూనిఫామ్‌ పేరిట నువ్వు పిచ్చి వేషాలేస్తే నిన్ను కోర్టుకి లాగుతా. మా యూనిఫామ్‌ను తాకాలని చూస్తే నీ ముఖం పగలకొడతా’ అంటూ సందేశం పెట్టాడు. ఆయన లెఫ్టినెంట్‌ కల్నల్‌ సందీప్‌ అహ్లావట్‌గా తర్వాత నిర్ధారణ అయ్యింది. ఇక ఈ విషయాన్ని ట్వింకిల్‌ ఖన్నా ట్విటర్‌లో ప్రస్తావించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని.. భౌతిక దాడులకు పాల్పడతామన్నందుకు ఆయనపై లీగల్‌ చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా రూపొందిన‌ చిత్రం ‘రుస్తుం’..  ఫ్రైడేస్‌ ఫిలిం వర్క్‌ పతాకంపై టీనూ సురేష్‌ దేశాయ్‌ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. 

నౌకాదళ అధికారి ‘రుస్తుం పావరి’ దేశం కోసం పోరాడిన అంశం నేపథ్యంతో చిత్రం రూపొందింది. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్‌ వద్ద రూ. 124 కోట్లు సాధించి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రంలో అక్ష‌య్ ధ‌రించిన దుస్తుల‌ని వేలం వేశారు. 20 వేల నుండి ప్రారంభ‌మైన ఈ వేలం శుక్రవారం సాయంత్రానికి 3 కోట్ల‌కి చేరింది. మే 26 సాయంత్రం 9.30ని.ల‌కి వేలం ముగియ‌నుంది. వ‌చ్చిన మొత్తాన్ని జంతువుల సంరక్షణ కోసం పనిచేసే ఓ ఎన్జీవోకు అక్ష‌య్ విరాళంగా ఇవ్వ‌నున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు