గాన గంధర్వుడు రిటైర్ అవుతున్నారా?

22 Dec, 2015 18:23 IST|Sakshi
గాన గంధర్వుడు రిటైర్ అవుతున్నారా?
 
హైదరాబాద్:  గానగంధర్వుడు డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  అయిదు దశాబ్దాల  సుదీర్ఘ కరియర్కు  ముగింపు పలకబోతున్నారా?  పాటల పల్లకీలో ఊరేగుతూ 49 సం.రాల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో మీడియాతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలాంటి అనుమానాన్ని రేకిత్తిస్తోంది.    పాటలకు న్యాయం  చేయలేను అని  అనిపించినపుడు పాటలు పాడటం  నిలివేయాలని భావిస్తున్నానంటూ బాలూ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.   పాటలు పాడేందుకు  భౌతికంగా,మానసికంగా తన బలం  సరిపోదన్నారు.  సామర్ధ్యం లేనపుడు.. పరిశ్రమను ఇంకా పట్టుకొని వేలాడం  సముచితం కాదని  పేర్కొన్నారు. జీవితంలో అన్ని అవకాశాలు అడగక్కుండానే వచ్చి వరించాయన్నారు. సుదీర్ఘ కాలం  సినీ కళామతల్లికి సేవ చేసే అదృష్టం కలిగడం చాలా సంతోషంగా ఉందని ఇక తనకు ఎలాంటి కోరికలు లేవని తెలిపారు.   రోజుకు 11గంటలకు పనిచేస్తూ.. ప్రతీరోజు ఒక సవాల్గా స్వీకరించానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 
 
1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో తెలుగు సినీ నేపథ్యగాయకుడిగా తెరపైకి వచ్చిన ఆయన ప్రస్థానంలో ఎక్కడా వెనకడుగులేదు.  హీరోలకు, నటులకు అనుగుణంగా పరకాయ ప్రవేశం చేసి ఆకట్టు కోవడం ఆయన ప్రత్యేకత.  తన అద్భుతమైన గాత్రంతో తెలుగు వారి మదిలో బాలుగా మిగిలిన లెజెండ్  ఆయన. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,తులు, హిందీ, ఇంగ్లీషు, లాంటి  దాదాపు 15   భాషల్లోగానస్వరాలను ప్రేక్షకులకు అందించి, ఎన్నో అభినందనలను, అవార్డు, రివార్డులను సొంతం చేసుకున్నారు. నటుడిగానూ, సంగీత దర్శకుడిగాను పనిచేసి ప్రేక్షకాభిమానుల అభిమానాన్ని చూరగొన్నారు.  బాలుకి 29 సార్లు నంది అవార్డులు, కలైమామణి, విశ్వగానయోగి, నాదనిధి, గానగంధర్వ వంటి బిరుదులను పొందారు.
2001వ సంవత్సరంలో  పద్మశ్రీ,  2011వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాలు ఆయను వరించాయి. ప్రముఖ హిందీ గాయకుడు మహ్మద్ రఫీ తన అభిమాన గాయకుడనీ,  ఆ లెజండ్రీ గాయకుడినుంచి  చాలా నేర్చుకున్నానన్నారు.   తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన గురువుగారు కోదండిపాణికి ఆజన్మాంతం రుణపడి వుంటానన్నారు.  అయితే ఇంజనీరింగ్ పూర్తి చేయకపోవడం, శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించకపోవడం తన జీవితంలో తీరని  లోటని బాలు పేర్కొన్నారు.