లైబ్రరీలో దాచుకునేలా మహానటుడు

8 Jun, 2019 02:44 IST|Sakshi
మహానటుడు పుస్తక ముఖచిత్రం

‘‘సావిత్రిగారు, యస్వీ రంగారావుగారు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. నా కాలేజీ రోజుల్లో యస్వీ రంగారావుగారి మీద ఆర్టికల్‌ రాస్తూ రిఫరెన్స్‌ కోసం మార్కెట్లో ఏదైనా బుక్‌ ఉందా అని చూస్తే ఎక్కువ మెటీరియల్‌ దొరకలేదు. దాంతో కసితో ఆయన గురించి రీసెర్చ్‌ చేయడం మొదలెట్టాను. దాదాపు 5 ఏళ్ల శ్రమతో యస్వీ రంగారావుగారి మీద సమగ్రమైన ఫొటో బయోగ్రఫీ తీసుకువస్తున్నాను’’ అన్నారు సంజయ్‌ కిషోర్‌. విశ్వనట చక్రవర్తి యస్వీ రంగారావు శత జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను ‘మహా నటుడు’ పేరుతో ఫొటో బయోగ్రఫీగా ఆవిష్కరించబోతున్నారు సంజయ్‌ కిషోర్‌. ఈ పుస్తకం నేడు హైదరాబాద్‌లో చిరంజీవి విడుదల చేస్తున్నారు. పుస్తక రూపకల్పన వెనక ఉన్న కథను ఆయన పంచుకున్నారు.

‘‘ఇండియాలో ఫొటో బయోగ్రఫీని పూర్తిస్థాయిలో తీసుకొచ్చింది మేమే. అప్పట్లో మార్కెట్లో కొన్ని ఫొటోబయోగ్రఫీలు ఉన్నప్పటికీ ఇంత సమగ్రంగా లేవు. చిన్న కాఫీ టేబుల్‌ బుక్స్‌లా ఉన్నాయి అంతే. కాలేజీ రోజుల్లో యస్వీ రంగారావుగారి మీద ‘విశ్వనట చక్రవర్తి’ అనే బుక్‌ రాశాను. దాన్ని గుమ్మడిగారు రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత యస్వీఆర్‌గారి ఫొటో బయోగ్రఫీ వేసే పనులు మొదలుపెట్టాను. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావుగారు ‘నా పుస్తకం కూడా వేయకపోయావా’ అనడంతో ‘మన అక్కినేని’ పుస్తకం రూపొందించాం. ‘విశ్వనట చక్రవర్తి’ పుస్తకం రాసే సమయంలో కలెక్ట్‌ చేసిన ఫొటోలు, ఆ తర్వాత ఈ బుక్‌ కోసం ఓ రెండేళ్లు మొత్తం 5 ఏళ్ల వర్క్‌ చేశాను. యస్వీఆర్, సినీ అభిమానులంతా తమ లైబ్రరీలో దాచుకునే పుస్తకంలా మాత్రం ఇది ఖచ్చితంగా ఉంటుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు