కల్యాణ్ మావయ్య ఫోన్ చేసి, హెల్మెట్ కొన్నావా అన్నారు!

21 Sep, 2015 23:07 IST|Sakshi
కల్యాణ్ మావయ్య ఫోన్ చేసి, హెల్మెట్ కొన్నావా అన్నారు!

- సాయిధరమ్ తేజ్
* హరీశ్ శంకర్‌గారు నాకు ‘మిరపకాయ్’ సినిమా టైం నుంచి తెలుసు. ‘రామయ్య వస్తావయ్యా’ సినిమా తర్వాత ఆయన నాకీ కథ చెప్పడానికి వచ్చారు. అప్పుడాయన నాతో ఓ మాట అన్నారు. ‘‘నన్ను ‘గబ్బర్‌సింగ్’ డైరక్టర్‌గా చూడకు. ఇప్పుడు నేను ఫ్లాప్ డైరక్టర్‌గా కథ చెబుతున్నా. నీకు నచ్చితేనే చేద్దాం’’ అన్నారు. కథ నచ్చడంతో, వెంటనే ఓకే చెప్పేశాను. ఈ కథపై నాకు కలిగిన నమ్మకం అలాంటిది. ‘దిల్’ రాజుగారి సినిమాల్లో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్, హరీశ్ శంకర్ మార్క్ కమర్షియల్ హంగులతో ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.
 
* చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలని తపించే పాత్రను ఈ సినిమాలో చేశాను. అందుకే అమెరికా వెళ్లి రెస్టారెంట్‌లో వెయిటర్‌లా, టాక్సీ డ్రైవర్‌గా.. డబ్బు కోసం ఇలా చాలా ఉద్యోగాలు చేస్తుంటాను. ఆ టైంలోనే హీరోయిన్‌కు సంబంధించిన ఓ సమస్యను సాల్వ్ చేస్తాను. ఈ క్రమంలోనే తనతో ప్రేమలో పడి, దాన్ని పెళ్లి దాకా ఎలా తీసుకెళ్లాననే ది మిగతా కథ. ఈ సినిమాలో మరో సాయిధరమ్ తేజ్‌ను చూస్తారు. నా గత చిత్రాలకు, ఈ సినిమాలోని పాత్రకు ఎటువంటి పోలిక ఉండదు. ఇందులోని సుబ్రమణ్యం పాత్రను ఆకళింపు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను.
 
* ఈ సినిమాలో చిరంజీవి మావయ్య హిట్ సాంగ్ ‘గువ్వా గోరింకతో...’ పాటను రీమిక్స్ చేయాలన్నది హరీశ్, ‘దిల్’ రాజుగార్ల చాయిస్.  ఆ సాంగ్ వేల్యూ చెడగొట్టకుండా చిత్రీకరించాం. ఏదో ఎట్రాక్ట్ చేయాలి అన్నట్టుగా ఈ పాట తీయలేదు. ఆయన సినిమాలను ఎలాగో రీమేక్ చేయలేం. అందుకే కనీసం పాటనైనా రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో రీమేక్ చేశాం. ఈ పాటను అమెరికాలోని గ్రాండ్ కేనియన్‌లో చిత్రీకరించాం. అక్కడ తొలిసారిగా షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదే. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు మాత్రమే  షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు రిహార్సల్స్ చేసి, తెల్లవారుజామున మూడు గంటలకు అక్కడికి బయలుదేరి కేవలం రెండు గంటల్లో పల్లవి, చరణం షూట్ చేశాం.
 
* నేను చిరంజీవి, పవన్‌కల్యాణ్ మావయ్యలను ఇమిటేట్ చేస్తున్నానని చాలా మంది అంటుంటారు. కావాలని వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ను ఫాలో కావడం లాంటివి చేయను. చిన్నతనం నుంచి మావయ్యలను దగ్గరగా చూస్తూ పెరిగాను. అందువల్ల ఆ మేనరిజమ్స్ వచ్చాయేమో గానీ కావాలని అలా నటించను.
 
* రెజీనాతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలో నటించాను. మంచి సపోర్టింగ్ కో యాక్టర్. రెజీనాతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కానీ ఆమె నా ఫ్రెండ్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇద్దరం డిస్కస్ చేసుకుని హరీశ్ శంకర్‌కు చెప్పేవాళ్లం.
 
* ఈ సినిమాలో మొదటిసారిగా నాగబాబు మావయ్యతో నటించాను. ఆయన రాకముందు చాలా ఈజీగా టేక్ ఓకే అయిపోయేది. కానీ ఆయన సెట్‌లోకి అడుగుపెట్టాక మాత్రం డైలాగ్ చెప్పడానికి టేక్స్ మీద టేక్స్ తీసుకునేవాణ్ణి. నా టెన్షన్ చూసి మావయ్య, హరీశ్‌గారు నాకు సర్ది చెప్పి డైలాగ్ చెప్పించారు. ఈ సినిమా షూటింగ్ టైంలో నాకిది మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా విజయంపై నాకు చాలా నమ్మకం ఉంది. ప్రేక్షకులకు నచ్చితే చిన్న హీరో, పెద్ద హీరో అన్న తేడా ఉండదు. నచ్చితే సినిమా హిట్ చేస్తారు.
 
* కథల విషయంలో ఎవరూ నాకు సలహాలివ్వరు. నాకేదైనా కథ నచ్చితే మావయ్యలకు ఇన్‌ఫార్మ్ చేస్తానంతే. నా విషయంలో మావయ్యలు చాలా కేరింగ్‌గా ఉంటారు. కల్యాణ్ మావయ్య తీసుకునే కేర్ గురించి ఓ ఎగ్జాంపుల్ చెప్పాలంటే.. నాకు బాగా డబ్బులు సంపాదించి బైక్ కొనాలని ఎప్పట్నుంచో ఆశ. ఈ మధ్యే హార్లీ డేవిడ్‌సన్ బైక్ కొన్నాను. ఆ విషయం తెలుసుకుని కల్యాణ్ మావయ్య ఫోన్ చేసి ‘హెల్మెట్ కొనుకున్నావా, గ్లౌజులు కొనుక్కున్నావా’ అని అడిగారు. అంత కేరింగ్‌గా ఉంటారు.
 
* భవిష్యత్తులో నాకు వచ్చిన కథలు మా కుటుంబంలో ఎవరికైనా సెట్ అవుతాయంటే కచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి రాలేదు.
 
* మంచి ప్రాజెక్ట్స్‌తో ‘దిల్’ రాజుగారు అప్రోచ్ అయ్యారు. అందుకే నా తదుపరి చిత్రాలు కూడా ఆయనతో కమిట్ అయ్యాను. ఎవరైనా మంచి కథతో వస్తే, కచ్చితంగా వేరే బ్యానర్‌లో నటించడానికి రెడీ. ప్రస్తుతం ‘తిక్క’ షూటింగ్ జరుగుతోంది. ‘దిల్’ రాజుగారి బేనర్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సుప్రీం ఏసి డీటీఎస్’, అలాగే వేగేశ్న సతీశ్ దర్శకత్వంలో ‘శతమానం భవతి’ సినిమాలు త్వరలో సెట్స్ పైకి వెళతాయి.