కత్తిలాంటోడి మాటలకి మరింత పదును

19 Jul, 2016 10:35 IST|Sakshi
కత్తిలాంటోడి మాటలకి మరింత పదును

మెగా అభిమానులను ఊరిస్తున్న చిరంజీవి 150వ సినిమాకు అదనపు ఆకర్షణలను జోడిస్తున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెర వెనుక పనిచేసే వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

వినాయక్ సినిమా అంటే సాధారణంగా ఆకుల శివ రచయితగా వ్యవహరిస్తాడు. కామెడీతో పాటు హీరోయిజాన్ని చూపించే మాస్ సన్నివేశాలకు మాటలు రాయటంలో ఆకుల శివ స్పెషలిస్ట్. కానీ ఇది చిరంజీవి 150వ సినిమా కాబట్టి అభిమానులు చిరంజీవి పోలిటికల్ ఇమేజ్కు తగ్గట్టుగా సందేశాత్మకమైన మాటలను కూడా ఆశిస్తారు. అందుకే ఆలోటు తీర్చేందుకు మరో రైటర్ను రంగంలోకి దించారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు మాటల రచయిత సుపరిచితుడైన సాయి మాధవ్ బుర్రా.. గోపాల గోపాల సినిమాతో మెగా కాంపౌడ్లోకి అడుగుపెట్టారు. ఆయన మాటల్లో సామాజిక అంశాలతో పాటు, సందేశాలు కూడా వినిపిస్తుండటంతో చిరు పిలిచి మరి అవకాశం ఇచ్చారట. అలా సాయి మాధవ్ రాసిన మాటలు, చిరంజీవి 150 సినిమాలోని కీలక సన్నివేశాల్లో వినిపించనున్నాయన్న టాక్ వినిపిస్తోంది.