ఇష్టంతో చేశా.. కష్టమనిపించలేదు

30 Dec, 2018 05:23 IST|Sakshi
సాయి మాధవ్‌ బుర్రా

దివంగత నటుడు, రాజకీయ నాయకుడు యన్‌.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. రెండు భాగాలుగా రూపొందిన ఈ బయోపిక్‌కు క్రిష్‌ దర్శకుడు. మొదటి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న రిలీజ్‌ కానున్న సందర్భంగా చిత్రమాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చెప్పిన విశేషాలు.

► నా చిన్నప్పటినుంచీ యన్‌.టి. రామారావుగారికి వీరాభిమానిని. ఆయన బయోపిక్‌కు మాటలందిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి రామారావుగారి సినిమాలు చూస్తూ పెరగడమే పెద్ద రీసెర్చ్‌. ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా రాయడానికి ప్రయత్నించాను.

► బాలకృష్ణగారు రచయితలను బాగా గౌరవిస్తారు. యన్‌టీఆర్‌గా కొన్ని సన్నివేశాల్లో ఆయన నటిస్తుంటే ఎమోషనల్‌ అయ్యాను. రామారావుగారి గురించి అన్ని సంఘటనలనూ  రెండు పార్ట్స్‌లో చూపించడం కష్టం. ఆయన జీవితాన్ని చెప్పాలంటే 10–15 సినిమాల్లో చెప్పాలి. అందుకే సినిమాకు ఏది అవసరమో, సమాజానికి ఏది అవసరమో అది మాత్రమే ఉంటుంది.

► కాంట్రవర్శీ అనేది ఇంట్రెస్ట్‌. కానీ సమాజానికి అవసరమేం కాదు. సినిమా చూశాక ప్రేక్షకుడికి అసంపూర్ణంగా, అసంతృప్తిగా మాత్రం అనిపించదు.

► తేజాగారు దర్శకుడిగా ఉన్నప్పుడు కూడా నేనే డైలాగ్‌ రైటర్‌ను. క్రిష్‌గారు వచ్చాక స్క్రీన్‌ప్లే స్టైల్‌ మారిపోయింది. ఈ సినిమాకు సంభాషణలు రాయడం సంతృప్తిని ఇచ్చింది. డైలాగ్స్‌ కోసం కష్టపడలేదు. ఇష్టంగా చేసిందేదీ కష్టం కాదు.

► ప్రస్తుతం చిరంజీవిగారి ‘సైరా’, రాజమౌళిగారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు రాస్తున్నాను. 

మరిన్ని వార్తలు