విద్యార్థినిగా ఫీలయ్యా!

1 May, 2019 09:13 IST|Sakshi

సినిమా: దర్శకుడు సెల్వరాఘవన్‌కు నటుడు సూర్య ఒక విజ్ఞప్తి చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం ఎన్‌జీకే. నటి సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్‌ ఫిలింస్‌ పతాకంపై ఎస్‌ఆర్‌.ప్రభు, ఎస్‌ఆర్‌.ప్రకాశ్‌ నిర్మించారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఈ ఎన్‌జీకే చిత్రం మే 31న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పాఠశాల విద్యార్ధినిలా..
ఇందులో పాల్గొన్న నటి సాయిపల్లవి మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి కాగానే ఒక పాఠశాల విద్యార్థినిలా ఫీలయ్యానని అన్నారు. తాను ఎప్పుడూ షూటింగ్‌కు వెళ్లే ముందు తనను తాను తయారు చేసుకుంటానన్నారు. అయితే ఈ చిత్రానికి అలాంటి అవసరం లేదని భావించానన్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనే ముందు పెద్దగా తెలుసుకునేదేముంటుందిలే అని అనుకున్నానని అయితే దర్శకుడు సెల్వరాఘవన్‌ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఒక్కో నటి, నటుడులోని ప్రతిభను వెలికి తీయడంలో సెల్వరాఘవన్‌ దిట్ట అని అన్నారు. సూర్యతో నటించి ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని సాయిపల్లవి పేర్కొన్నారు.

సెల్వరాఘవన్‌ దర్శకత్వం అంటే ఇష్టం
కాగా చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ రాజకీయం రక్తం చిందని యుద్ధం,  యుద్ధం రక్తం చిందే రాజకీయం అని పేర్కొన్నారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించడం ప్రతిరోజూ కొత్త చిత్రంలో నటించడానికి వెళుతున్నట్లు అనిపించిందన్నారు. నిన్న జరిగిన షూటింగ్‌కు ఇవాళ కొనసాగింపు ఉండదన్నారు. సమయం ముగిసినా ఆయన పని చేస్తూనే ఉంటానని అన్నారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వం, ఆయన రచన అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు. ఆయన దర్శకత్వంలో మనస్ఫూర్తిగా నటించానని సూర్య అన్నారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం అంటేనే తనకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఆయన సంగీతం కాలాన్ని జయిస్తుందని అన్నారు. నటి సాయిపల్లవి ప్రతి సన్నివేశం పూర్తి అయిన తరువాత బాగా నటించానా అని అడుగుతూ చాలా అంకితభావంతో నటించారని చెప్పారు. ఇందులో నటించిన అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారని తెలిపారు. షూటింగ్‌లో జాప్యం జరిగినా చిత్ర నిర్మాత  ఎస్‌ఆర్‌.ప్రభు చిత్రానికి ఏమేం కావాలో అన్నీ సరైన సమయానికి సమకూర్చారని సూర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సెల్వరాఘవన్, సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా నటుడు శివకుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు