తొలి ప్రయత్నంగా ఒక విలువైన ప్రేమకథను తీయడం సంతృప్తినిచ్చింది

12 Dec, 2014 22:38 IST|Sakshi
తొలి ప్రయత్నంగా ఒక విలువైన ప్రేమకథను తీయడం సంతృప్తినిచ్చింది

- డా. నాగేశ్వరరావు కొల్లా
వృత్తిరీత్యా ఆయనొక డాక్టరు. కానీ సినిమా అంటే ప్రాణం. ప్రతీ వారం ఓ సినిమా చూడందే నిద్ర పట్టదు. ఆ ప్రేమే నిర్మాతను చేసింది. సినీ ప్రయాణానికి పునాది వేసింది. ‘‘నాకున్న అభిరుచి వల్ల ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రకంగా సినిమా రంగంలో భాగమవుతానని అనుకొన్నా. ఇప్పుడు నిర్మాతగా మారి ఓ మంచి సినిమా తీయడం ఆనందంగా ఉంది. ఇక నుంచి విభిన్నమైన కథలతో క్రమం తప్పకుండా సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నా’’ అంటున్నారు డా. నాగేశ్వరరావు కొల్లా.

ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్‌పై డా. నాగేశ్వరరావు కొల్లా నిర్మించిన చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. దిలీప్ కుమార్, ప్రియాల్ గోర్ జంటగా నటించారు. శశికిరణ్ నారాయణ దర్శకత్వం వహించారు. డా. సువర్ణ కొల్లా సమర్పించారు. నేడు (13న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొ స్తోంది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు కొల్లాతో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ విషయాలివి..

- చిత్ర కథానాయకుడు దిలీప్ కుమార్ పరిచయంతో సినిమా గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. తన కోసమే మలయాళ చిత్రం ‘తటాత్తిన్ మరయతు’ రీమేక్ హక్కులు కొన్నాను. ఆ హక్కులు కొన్నాక ఇలాంటి ఓ మంచి చిత్రాన్ని మనమే ఎందుకు నిర్మించకూడదు అనే ఆలోచన వచ్చింది. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని నిర్మాణంలోకి అడుగుపెట్టాం. తొలి ప్రయత్నంగా ఒక విలువైన ప్రేమకథను తీయడం సంతృప్తినిచ్చింది. ఈ సినిమాని కొత్తవాళ్లతో తీయడానికి ఓ ప్రధానమైన కారణం ఉంది. నేను డాక్టరు వృత్తిని చేపట్టిన కొత్తలో పైకి ఎదగాలని, పేరు తెచ్చుకోవాలని ఎంతో కసితో పనిచేశా. ఆ కసి, పట్టుదల నవతరంలో మరింత మెండుగా ఉంటాయని భావించి నాయకానాయికలుగా, దర్శకునిగా కొత్తవాళ్లని ఎంపిక చేసుకొని ఈ సినిమా చేశా.
 
- భావోద్వేగాల సమ్మేళనమే ఈ చిత్రం. ప్రేమలో పడ్డ ఓ యువకుడిలో భావోద్వేగాలు ఎలా మారుతుంటాయనే అంశం ఇందులో కీలకం. తన ప్రేయసి కదలికల అనుగుణంగా అతనిలో ఎలాంటి మార్పులు కనిపిస్తుంటాయో ఇందులో చాలా బాగా చూపించారు దర్శకురాలు. దిలీప్, ప్రియాల్ జంట తెరపై చూడ ముచ్చటగా ఉంటుంది. మలయాళంలో ఈ కథకి మంచి ఆదరణ దక్కింది.

భారీ వసూళ్లు దక్కాయి. అదే స్థాయిలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని భావిస్తున్నాం. మేం పరిశ్రమకు కొత్తే అయినా నిర్మాణ పరంగా ఎక్కడా ఇబ్బందులు పడలేదు. పక్కా ప్రణాళికతో సెట్స్‌పైకి వెళితే బడ్జెట్ విషయంలోనూ తేడాలు రావనేది నా అభిప్రాయం. అయితే థియేటర్ల విషయంలోనే కొంచెం ఇబ్బందులు తలెత్తాయి. అన్ని ఇబ్బందుల్నీ అధిగమించి మంచి సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకం మాకుంది. తదుపరి మా సంస్థలో మరిన్ని సినిమాలు తెరకెక్కుతాయి. స్నేహితులతో కలసి మంచి కథల్ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచన ఉంది.