నా బర్త్‌డే కేక్‌ నేనే తయారు చేసుకున్నా

5 Jun, 2020 00:23 IST|Sakshi
సురభి

‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ (2016), ‘జెంటిల్‌మేన్‌’ (2016), ‘ఒక్కక్షణం’ (2017) చిత్రాల్లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకున్నారు హీరోయిన్‌ సురభి. ఆ తర్వాత కెరీర్‌లో కాస్త నెమ్మదించినా ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడలో సినిమాలకు సైన్‌ చేసి, ఫుల్‌ స్పీడ్‌లో ఉన్నారు. నేడు సురభి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సురభి చెప్పిన విశేషాలు.

► గత ఏడాది నా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గానే జరిగాయి. కానీ ఈ ఏడాది లాక్‌డౌన్‌ వల్ల బయటకు వెళ్లలేం. ముంబైలో వర్షాలు కూడా పడుతున్నాయి. సో... ఈ ఏడాది నా బర్త్‌డే వేడుకలు ముంబైలోని మా ఇంట్లో మా తల్లిదండ్రుల సమక్షంలో జరుగుతాయి. ప్రతి ఏడాది నా బర్త్‌డే వేడుకల్లో నా స్నేహితులు పాల్గొనేవారు. ఈసారి వారిని బాగా మిస్‌ అవుతున్నాను.

► లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉంటున్నాం. చాలా సమయం కూడా దొరికినట్లయింది. దీంతో కొత్త వంటకాలు  నేర్చుకున్నాను. వంటలు చేయడానికి మా అమ్మగారు హెల్ప్‌ చేస్తున్నారు. పానీపూరి, చాట్, వడపావ్‌.. ఇలా చాలా ఐటమ్స్‌ చేశాను. విశేషం ఏంటంటే... నా బర్త్‌డేకి నా కేక్‌ను నేనే తయారు చేసుకున్నాను. కుకింగ్‌ కాకుండా ఇంకా పెయింటింగ్స్‌ వేశాను. గార్డెనింగ్‌ పనులు చూసుకుంటున్నాను. సమ్మర్‌ హాలీడేస్‌లా అనిపిస్తోంది. కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాను. నా గురించి కూడా నేను ఆలోచించుకునే వీలు దొరికింది.

► ‘ఒక్కక్షణం’ తర్వాత నాకు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ కథలు నచ్చలేదు. అయితే వేరే భాషల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్‌ హీరోగా చేస్తోన్న ‘శశి’ చిత్రంలో నటిస్తున్నాను. ‘శశి’ మంచి ప్రేమకథా చిత్రం. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. సాంగ్స్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత వాటిని పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇంకా తమిళంలో జీవీ ప్రకాష్‌కుమార్, కన్నడలో గణేశ్‌ హీరోలుగా చేస్తోన్న సినిమాల్లో నటిస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత వాటిపై స్పష్టత వస్తుంది.
     
► ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించాలని ఉంది. ఇటీవలే ఓ కథ విన్నాను. ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. పోలీసాఫీసర్‌ పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేయాలని ఉంది. ఈ విషయంలో నాకు విజయశాంతిగారు స్ఫూర్తి. యాక్షన్‌ సినిమాల్లో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ చేశారు. తెలుగులో నా ఫేవరెట్‌ యాక్టర్స్‌ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, శర్వానంద్‌... ఇలా చాలామంది ఉన్నారు.
     
► వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తాను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు