బాలకృష్ణను డీల్ చేయడం కష్టమన్నారు...

22 Jan, 2016 02:02 IST|Sakshi
బాలకృష్ణను డీల్ చేయడం కష్టమన్నారు...

‘డిక్టేటర్’తో శ్రీవాస్ త్రిబుల్ హ్యాపీ. దర్శకునిగా, నిర్మాతగా, పంపిణీదారునిగా ఈ సినిమా తనకో మరపు రాని విజయమని శ్రీవాస్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో శ్రీవాస్ మీడియాతో చాలాసేపు ముచ్చటించారు...
 
ముందుగా ‘డిక్టేటర్’ రెస్పాన్స్ గురించి చెబుతారా?
అద్భుతంగా ఉంది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్ సినిమా వచ్చిందని చూసినవాళ్లందరూ అంటున్నారు. బాలయ్య బాబుకి స్పెషల్ ఇమేజ్ తీసుకు రావాలనుకున్నాను. అది నెరవేరింది. సో.. అందరం హ్యాపీగా ఉన్నాం.

బాలకృష్ణ కోసమే ఈ కథ రాశారా?
అవును. ఆయన కోసమే తయారు చేసిన కథ ఇది. ‘లౌక్యం’ తర్వాత నేను బాలయ్యబాబుని కలిశాను. అప్పుడాయన ‘నా 99వ సినిమాకి నువ్వే దర్శకుడివి. సినిమా చేద్దాం’ అన్నారు. ముందు కథ కూడా వినలేదు. డెరైక్ట్‌గా నన్నే నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే బాలయ్యబాబు అభిమానులు ఆయన ఎలాంటి సినిమాలో నటిస్తే చూడాలనుకుంటారో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా వదులుకోకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కోన వెంకట్, గోపీ మోహన్, నేనూ ఈ కథ చేశాం.

‘డిక్టేటర్’ టైటిల్ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా?
కథ రెడీ అవుతున్న టైమ్‌లోనే ఈ టైటిల్ అనుకున్నాం. సెకండాఫ్‌లో వచ్చే హీరో క్యారెక్టరైజేషన్‌కి ఇదే బాగుంటుందనిపించింది. అందుకే అందరం అనుకుని, దీన్నే ఫైనలైజ్ చేశాం.

వసూళ్లు గురించి ఏం చెబుతారు... కొంచెం తగ్గాయనీ.. ముఖ్యంగా నైజాంలో డ్రాప్ అయ్యాయనే టాక్ వినపడుతోంది..?
సంక్రాంతికి వచ్చిన సోలో సినిమా కాదిది. నాలుగైదు సినిమాలు రావడంవల్ల వసూళ్లు డివైడ్ అవుతాయి. నేనీ చిత్రానికి నిర్మాతగా కూడా చేశాను కాబట్టి, వసూళ్లు గురించి మెసేజ్‌లు వస్తున్నాయి. ఎక్కడా తగ్గలేదు. ఈ సినిమాకి మేం అనుకున్నట్లుగానే వసూళ్లు ఉన్నాయి. ఇక, నైజాంలో బాలయ్య బాబు చిత్రాలకు వసూళ్లు కొంచెం తక్కువగానే ఉంటాయి. మొదటి వారానికే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌జోన్‌లోకి వచ్చేశారు. ఈ వీకెండ్ నుంచి ఓవర్ ఫ్లో మొదలవుతుంది.

98 సినిమాలు చేసిన హీరోతో సినిమా అంటేనే సవాల్. పైగా దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ చేయడం అంటే ఇంకా సవాల్ కదా. మరి... నిర్మాతగా కూడా ఎందుకు చేశారు?
యాక్చువల్‌గా ముందు అనుకోలేదు. డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండే నరసింహారావు అని నా ఫ్రెండ్ ఈరోస్ సంస్థకు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. వాళ్లకు తనుఈ ప్రాజెక్ట్ అవుట్‌లైన్ చెబితే, నిర్మించడానికి ముందుకొచ్చారు. అయితే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్లకు ఎవరైనా కావాల్సి వచ్చింది. ఈ చిత్రం చర్చల్లో భాగంగా నేను ఒకటీ రెండు నెలలు ఈరోస్ వాళ్లతో ట్రావెల్ అయ్యాను. అప్పుడు నా మీద నమ్మకం కుదిరి, నన్నే చేయన్నారు. దాంతో మా పాప ‘వేదాశ్వ’ పేరుతో బేనర్ ఆరంభించాను. ఇప్పటివరకూ నిర్మాతలతో టైఅప్ అయ్యి ఈరోస్‌వాళ్లు సినిమాలు తీశారు కానీ, డెరైక్టర్‌తో వాళ్లు టైఅప్ కావడం ఇదే మొదటిసారి.

బాలకృష్ణను డీల్ చేయడం కొంచెం కష్టం అని కొంతమంది అంటారు..  ఆయనతో మీ ఎక్స్‌పీరియన్స్?
నాతోనూ కొంతమంది అలా అన్నారు. ఆయనతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను గమనించింది ఏంటంటే... బాలయ్య బాబు ప్రవర్తన నిజాయతీగా ఉంటుంది. ముందు ఒకటీ వెనకాల ఒకటీ మాట్లాడరు. తనతో పాటు ఉండేవాళ్లు సింగిల్ ఫేస్‌తో ఉండాలనుకుంటారు. నాక్కూడా ఆయనలా ఓపెన్‌గా ఉండటం ఇష్టం. దర్శకుడిగా నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నిర్మాతగా ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నాను.. వంటి విషయాలన్నీ క్లియర్‌గా చెప్పేవాణ్ణి. దాంతో కనెక్ట్ అయ్యాం.

ఈ చిత్రం కోసం మొత్తం 95 రోజులు పని చేశాం. ఆయన సీరియస్ అయిన రోజు ఒక్కటి కూడా లేదు. బాలయ్య బాబు స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు. అలాగే, యూనిట్ సభ్యులకు నగదు బహుమతి ఇచ్చారు. సినిమా సక్సెస్ తర్వాత సెపరేట్‌గా అందరికీ పార్టీ ఇచ్చారు. ఇలా ఎప్పుడూ చేయలేదనీ, ఇదే ఫస్ట్ టైమ్ అనీ ఆయన స్టాఫ్ అన్నారు. దాన్నిబట్టి ఈ సినిమా విషయంలో బాలయ్యబాబు ఎంత హ్యాపీ ఫీలయ్యారో అర్థం చేసుకోవచ్చు.

మరి.. బాలకృష్ణ మీకేం ఇచ్చారు?
ఆయనతో ఏర్పడ్డ అనుబంధం నాకు పెద్ద గిఫ్ట్‌లాంటిది. దానికి విలువ కట్టలేను. ‘మన శ్రీవాస్’ అని తన కుటుంబ సభ్యులందరికీ ఆయన పరిచయం చేశారు. ఎన్టీఆర్‌గారిలాంటి పేరున్న కుటుంబానికి దగ్గరవ్వడం మంచి అనుభూతి మిగిల్చింది. చంద్రబాబు నాయుడుగారు కూడా ఫోన్ చేసి, మాట్లాడారు. ‘మంచి సినిమా ఇచ్చారు. సంక్రాంతి రోజు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం. మనవాళ్లందరూ తలెత్తుకుని తిరిగే సినిమా ఇచ్చారు. మనం కలుద్దాం’ అని ఆయన అభినందించారు.

మళ్లీ బాలకృష్ణతో సినిమా చేస్తారా?
తప్పకుండా. మోక్షు (బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ)తో కూడా చేయాలని ఉంది. కథ కుదిరితే ఎప్పుడైనా చేయడానికి నేను రెడీ.
 

‘డిక్టేటర్’ డిస్ట్రిబ్యూటర్స్‌కి 15 శాతం డిస్కౌంట్ ఇవ్వడానికి కారణం ఏంటి?
ఈ చిత్రాన్ని దాదాపు నాకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్సే కొన్నారు. బాలయ్యబాబు సినిమా కాబట్టి డిస్ట్రిబ్యూటర్లందరూ మంచి రేట్‌కే ఈ సినిమా కమిట్ అయ్యారు. అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ, ఆ తర్వాత సంక్రాంతికి వేరే చిత్రాల రిలీజ్ కూడా ఉండటంవల్ల అనుకున్న థియేటర్లు వాళ్లకు దొరకలేదు. దానివల్ల డబ్బులు సర్దుబాటు చేయలేకపోయారు. దాంతో ఇబ్బందిపడ్డారు. మామూలుగా ఇలాంటి విషయాలను సినిమా విడుదలకు ముందు చెబుతుంటారు. కానీ, మా డిస్ట్రిబ్యూటర్లు పదిహేను రోజుల ముందే నా దృష్టికి తీసుకు వచ్చారు. నేను ఈరోస్ వాళ్లతో సంప్రతించి, 15 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా చేశా. ఇదంతా కూడా బాలయ్య బాబు సమక్షంలోనే జరిగింది. ఫస్ట్ వీక్‌కే అందరికీ డబ్బులొచ్చేశాయ్.

‘లౌక్యం’లో పృథ్వీ పాత్ర బాగా కామెడీ చేసింది. ‘డిక్టేటర్’లో కామెడీ డోస్ తగ్గించడానికి కారణం ఏంటి?
గోపీచంద్‌తో వినోద ప్రధానంగా ‘లౌక్యం’ తీశాను. అందుకని, బాలయ్య బాబుతో ఎలాంటి సినిమా చేస్తానో అని అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. బాలయ్యతో ఎక్కువ కామెడీ చేస్తానేమోనని టెన్షన్ పడ్డారు. ఆయనతో కామెడీ చేయలేం. బాలయ్యబాబు అంటే డేంజరస్ జోన్. ఆయనకు తగ్గట్టుగానే ఉండాలి. అందుకని, కామెడీ మీద పెద్దగా కాన్‌సన్‌ట్రేట్ చేయలేదు.

‘డిక్టేటర్’ని హిందీలో చేస్తారట?
ఈ చిత్రం అజయ్ దేవగన్‌కి అయితే బాగుంటుందని ఈరోస్‌వాళ్లు అనుకుంటున్నారు. ఒకవేళ హిందీలో చేస్తే నేను డెరైక్షన్ చేస్తాను.
 

మీ బేనర్‌లో ఇతర దర్శకులతో కూడా సినిమాలు చేస్తారా?
మంచి కథలతో ఎవరు వచ్చినా ఈరోస్‌వాళ్లకు సజెస్ట్ చేస్తాను. నచ్చితే చేస్తాం.

మీ తదుపరి చిత్రం?
త్వరలో చెబుతాను. ప్రస్తుతం ‘డిక్టేటర్’ మూడ్‌లోనే ఉన్నాను. అభిమానులను కలవడం కోసం బాలయ్యబాబు, నేను, ఇంకింతమంది వైజాగ్, విజయవాడ, రాజమండ్రి వెళ్లబోతున్నాం.
 
అందుకే సేఫ్ గేమ్ ఆడాను!
కథ రొటీన్‌గా ఉందని కొంతమంది అంటున్నారు.. అలా అనేవాళ్లకి మీ సమాధానం?
'ఆల్రెడీ 98 సినిమాలు చేసిన స్టార్‌డమ్ ఉన్న హీరోతో సినిమా అంటే ఆ హీరో ఇమేజ్‌కి అనుగుణంగానే వెళ్లాలి. ఆయన అభిమానులు డిసప్పాయింట్ అవ్వకూడదనుకున్నా. బాలయ్యబాబు ఇంతకుముందు చేసిన సినిమాలకకన్నా స్పెషల్‌గా చేయలనుకున్నాను తప్ప ఎవరూ చేయని కొత్త పాయింట్‌తో  చేయాలని అనుకోలేదు. నేను పర్సనల్‌గా నమ్మిందేంటంటే.. ఒక పెద్ద కమర్షియల్ హీరోతో అందరికీ అర్థమయ్యే కథనే కొత్తగా చెబితే సక్సెస్ అవుతాం అనుకున్నాను. అలా చేస్తేనే హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందనుకున్నాను. ఇప్పటివరకూ రాని పాయింట్‌తో చేయడానికి నాకు ధైర్యం సరిపోలేదు. అదే కొత్త హీరోలతోనో, సీ గ్రేడ్ హీరోలతోనో అయితే ఎంత కొత్త పాయింట్ అయినా టచ్ చేస్తాను. కానీ, ఇక్కడ చేయలేను.

ఎన్నో ఫ్యామిలీస్, కోట్ల రూపాయల డబ్బు ఇన్‌వాల్వ్ అయ్యుంటాయి. అందుకని ప్రయోగం చేయడానికి భయపడ్డాను. నావల్ థాట్‌కి ఏసీ డీసీ ఉంటుంది. ఒక్కోసారి క్లిక్ అవ్వచ్చు.. క్లిక్ కాపోవచ్చు. ఒక స్టార్ చేతిలో ఉన్నప్పుడు ఏసీ డీసీ ప్రాజెక్ట్ చేయడానికి ఇష్టపడను. నా నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్ల సేఫ్టీ నాకు ముఖ్యం. వాళ్లు హ్యాపీ అంటే.. నాకు చాలు. సంతృప్తిపడిపోతా. ‘పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకూ ఎవరూ చేయని పాయింట్‌తో తీశారు’ అనే అభినందనలతో ఒక ఫోన్ కాల్, ‘సార్.. మేం కొనుక్కున్న సినిమా పోయింది. మా ఫ్యామిలీలు రొడ్డు మీదకొచ్చేస్తాయ్’ అని మరో ఫోన్ కాల్ అందుకోవడం నాకిష్టం లేదు. అందరి సేఫ్టీ ముఖ్యం. అందుకే సేఫ్ గేమ్ ఆడాను'.