నా తొలి పాటే బాలూ గారితోపాడాను!

29 Jul, 2014 00:29 IST|Sakshi
నా తొలి పాటే బాలూ గారితోపాడాను!

శ్రావ్యమైన గానం, శుద్ధమైన గాత్రం.. వెరసి మాళవిక. యుగళగీతం, విరహగీతం, భక్తిగీతం, ఫాస్ట్ బీట్.. ఇలా ఏ తరహా గీతానికయినా సరే... తన గానంతో ప్రాణం పోయగల దిట్ట తను. పదకొండేళ్ల సినీ సంగీత ప్రయాణంలో ఎన్నో మంచి పాటలు పాడి, తెలుగు శ్రోతల మనసుల్ని గెలిచిన ఈ యువగాయనితో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ...
 
ఈ సంగీత ప్రయాణం ఎలా ఉంది?
చాలా బావుందండీ... నాకే కాదు, నా తోటి సింగర్స్‌కు కూడా తగిన ప్రోత్సాహం లభిస్తోంది.

గతంతో పోలిస్తే... మీ తరానికి కాస్త పోటీ ఎక్కువే కదా!
అవును. అప్పట్లో తక్కువ మంది సింగర్లు ఉండేవారు. అందుకే వారికి ఎక్కువ పాటలు పాడే అవకాశం దక్కింది. మాకు ఆ పరిస్థితి లేదు. అయితే... అందరికీ పాడే అవకాశాలు లభించడం మాత్రం ఆనందంగా ఉంది. ఏ రంగంలోనైనా కొంత మంచి, కొంత చెడు సహజమే కదా!
 
మీ తోటి సింగర్లలో మీకు నచ్చిన వాళ్లెవరు?
అందరూ మంచి సింగర్లే. ఎవరికుండే ప్రత్యేకతలు వారివే.
 
సరే.. గాయనిగా మీకు ప్రేరణ?
ఎస్.జానకిగారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రభావం కూడా నాపై ఉంటుంది.
 
క్లాసికల్ నేర్చుకున్నారా?
ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. డీవీ మోహనకృష్ణగారు నా గురువు. ఇప్పటికే బి.ఏ మ్యూజిక్ చేశాను. ఇక వెస్ట్రన్ మ్యూజిక్ విషయానికొస్తే... ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో 6వ గ్రేడ్ చేశాను. నాకు తొలి గురువు మా అమ్మే. మా అమ్మ మ్యూజిక్ టీచర్. చాలామంది మా ఇంట్లోనే సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. అలా చిన్నప్పట్నుంచీ సంగీతం నా జీవితంలో భాగమైపోయింది. అమ్మ దగ్గరే బేసిక్స్ నేర్చుకున్నా.
 
మీ స్వస్థలం ఎక్కడ?

విశాఖపట్నం.. అక్కడే పెరిగాను. నాన్న రిటైర్డ్ సివిల్ ఇంజినీర్. 6వ తరగతి చదువుతున్నప్పుడే... ‘పాడుతా తీయగా’ చిల్డ్రన్స్ సిరీస్‌లో పాల్గొని విన్నర్‌గా నిలిచాను.
 
మరి సినీగాయనిగా ఎలా మారారు?
సంగీత దర్శకుడు ఆశీర్వాద్‌గారు ‘రాక్‌ఫోర్డ్’ అనే ఆంగ్ల చిత్రానికి నాతో ఓ ఇంగ్లిష్ పాట పాడించారు. తర్వాత ఆయనే... ‘బాలీవుడ్ కాలింగ్’ అనే హిందీ చిత్రానికి హిందీ పాట పాడించారు. శంకర్‌మహదేవన్ గారితో కలిసి ఆ పాట పాడాను. ఆ రెండు ఆల్బమ్స్‌నీ కీరవాణిగారు విన్నారు. ఆయనకు నచ్చి నాకు ‘గంగోత్రి’ (2003) సినిమాకు పాడే అవకాశం ఇచ్చారు. ‘నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం’ నేను పాడిన తొలి తెలుగు సినిమా పాట. తొలిపాటకే గొప్ప స్పందన లభించింది. ఇక ఆ తర్వాత మీకు తెలిసిందే.
 
పన్నెండేళ్ల ప్రాయంలో ‘పాడుతా తీయగా’ విజేత అయినప్పుడు బాలూగారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. అలాంటి మీరు.. తొలి పాటే బాలూగారితో పాడటం ఎలా అనిపించింది?
అది డ్యూయెట్ అని తెలుసుకానీ... నాతో పాడేది బాలు గారని తెలీదు. పైగా ఇదివరకులా కలిసి పాడనవసరం లేదు కదా. ఎవరి ట్రాక్ వారు పాడేసుకోవడమే. పాటంతా విన్నాక కానీ నాకు తెలీలేదు... మేల్ సింగర్ బాలూగారని. బాలూగారు కూడా నన్నెంతో మెచ్చుకున్నారు.
 
ఇప్పటికి ఎన్ని అవార్డులు అందుకున్నారు?
ప్రైవేటు అవార్డులు చాలా వచ్చాయి. నంది అవార్డులు మాత్రం రెండు అందుకున్నాను. ఒకటి టీవీ రంగం నుంచి వస్తే, రెండోది సినీరంగం నుంచి వచ్చింది. ‘మేలుకొలుపు’ అనే బుల్లితెర కార్యక్రమానికి మాధవపెద్ది సురేశ్‌గారి స్వర రచనలో ఓ పాట పాడాను. దానికి నంది రాగా, రెండో నంది... ‘రాజన్న’ సినిమాకు గాను నేను పాడిన ‘అమ్మా అవనీ..’ పాటకు లభించింది.
 
మీకు బాగా పేరు తెచ్చిన పాటలు?
‘గంగోత్రి’లో ‘నువ్వు నేను...’, ‘బిల్లా’లో ‘బొమ్మాలీ...’, ‘ఏక్‌నిరంజన్’లో ‘ఎవరూ లేరని అనకు’, ‘ప్రేమకథాచిత్రమ్’లో ‘వెన్నెలైనా చీకటైనా’, ‘వరుడు’లో ‘అయిదు రోజుల పెళ్లి’... ఇలా చాలా ఉన్నాయి.
 
మీరు బాగా కష్టపడి పాడిన పాట?
‘అమ్మా అవనీ...’. ఆ పాట సందర్భం సినిమాకు చాలా కీలకం. ఎంతో ఫీలై పాడాల్సిన పాట. అందుకే జాగ్రత్తలు తీసుకొని పాడా.
 
సంగీత దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
లేదండీ... సంగీత దర్శకులందరి స్వరరచనలో పాడాలని ఉంది. వారి ప్రోత్సాహం వల్లే ఈ రోజు ఇంటర్‌వ్యూ ఇచ్చే స్థాయికి రాగలిగాను. నిజంగా వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఎన్నేళ్లు గడిచినా గుర్తుండిపోయే పాటలు పాడాలని ఉంది. నా లక్ష్యం అదే.