నాన్నకు నేను విలన్ అయినా.. ఆయన నాకు విలన్ అయినా ఓకే!

8 Oct, 2016 00:58 IST|Sakshi
నాన్నకు నేను విలన్ అయినా.. ఆయన నాకు విలన్ అయినా ఓకే!

‘‘సినిమా పరిశ్రమలోకి ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ పక్కా భవిష్యత్ ప్రణాళికతో వస్తున్నారు. ఐదేళ్లు, పదేళ్లు ఇండస్ట్రీలో ఉండి తర్వాత పెళ్లి చేసుకుని సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. కానీ, నేనలా అనుకోవడం లేదు. జీవితాంతం యాక్టర్‌గా కొనసాగాలనుకుంటున్నా’’ అని మంచు లక్ష్మీప్రసన్న తన మనసులోని మాట చెప్పారు. నేడు (శనివారం) లక్ష్మీ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారామె.

 ఈ పుట్టినరోజుకు ప్రత్యేకించి ఎటువంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ పెట్టుకోలేదు. అమ్మ, నాన్న, భర్త, కూతురు, సోదరులు, మేనకోడళ్లతో ఈ రోజు ఒక్కపూటైనా కలిసి భోజనం చేయాలనుకుంటున్నా.  నేను బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు చేసినా ‘మేము సైతం’ చాలా సంతృప్తినిస్తోంది. ఎంతో మందికి చేయూతనిస్తోన్న ప్రోగ్రామ్ ఇది. ఈ షోకి చాలామంది సెలబ్రిటీలను పిలిచినా ప్రభాస్‌ను మాత్రం పిలవలేదు. ‘బాహుబలి’ షూటింగ్‌లో తను బిజీగా ఉన్నందున పిలిస్తే దర్శకుడు రాజమౌళికి కోపం వస్తుందని ఆగా. నా క్లోజ్ ఫ్రెండ్ రానా మాత్రం షూటింగ్‌లో ఉన్నా వచ్చాడు. ఇటువంటి షో చేయడానికి రీజన్ ఏమీ లేదు. 


‘అందరూ చేసింది నేను చేయలేను.. నేను చేసింది ఎవరూ చేయలేరు’ అని ఆలోచిస్తూ ముందుకెళతా. మంచి కథ లొస్తే నిర్మాతగానూ కొనసాగుతా.   నాన్నగారితో కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ చేయాలనుంది. కానీ, నాకు సవాల్‌గా అనిపించే పాత్ర కుదరడం లేదు. ఆయనకు నేను విలన్‌గా అయినా.. ఆయన నాకు విలనైనా ఓకే.  కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో నేను లీడ్ రోల్ చేసిన ‘లక్ష్మీబాంబ్’ దీపావళికి ముందు కానీ, తర్వాత కానీ విడుదలవుతుంది. దర్శక-నిర్మాతలు ఈ చిత్రం టైటిల్ చెప్పినప్పుడు నాకు సిగ్గేసింది. కానీ, అనౌన్స్ చేసిన తర్వాత కరెక్ట్ టైటిల్ పెట్టారంటూ చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి.

  
‘లక్ష్మీబాంబ్’ తర్వాత ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాను. అడవి శేష్‌ని హీరోగా అనుకుంటున్నాం. తను డేట్స్ ఇవ్వడం లేదు. మా అమ్మాయి విద్యానిర్వాణ ఆనంద్ యాక్టర్ కావాలని కోరుకుంటున్నా. ఆ విషయంలో నేను బలవంతం చేయను. తన ఇష్టం. తను డాక్టర్ అయితే డా.విద్య అనీ, యాక్టర్ అయితే నిర్వాణ మంచు అని ఫిక్స్ అయిపోతా (నవ్వుతూ).