చీరలు, చుడీదార్లు వేసుకుని ఈత కొట్టలేముగా...

15 Feb, 2014 00:00 IST|Sakshi
చీరలు, చుడీదార్లు వేసుకుని ఈత కొట్టలేముగా...

తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో బాలీవుడ్ కథానాయిక  వాణీకపూర్. ‘ఆహా కల్యాణం’లో నానికి జంటగా నటించిన ఈ ఢిల్లీ భామ, ‘శుద్ద్ దేశీ రొమాన్స్’ చిత్రంతో యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ‘ఆహా కల్యాణం’తో తెలుగు ప్రేక్షకులతోనూ ఆహా అనిపించుకుంటానంటోన్న వాణీకపూర్‌తో ‘సాక్షి’ స్పెషల్ చిట్‌చాట్...
 
*  మీరేమో ఉత్తరాది అమ్మాయి. మీ పేరు చూస్తే దక్షిణాది వారిలా అనిపిస్తోంది?
 మా నాన్నగారే నాకు ఈ పేరు పెట్టారు. ప్రత్యేక కారణం కూడా ఏమీ లేదట. బహుశా భవిష్యత్తులో నాకు సినిమాల ద్వారా దక్షిణాదితో అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ఆ పేరు సెట్ అయ్యిందేమో.


*  అసలు సినిమా రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
 చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. మన భారతీయ సినిమాలకు బలం పాటలే. సినిమాల్లో పాటలు, డాన్సులు చూసినప్పుడు నాకు భలే అనిపించేది. పైగా, నేను ఏ విషయాన్నయినా చక్కగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాను. అందుకే సినిమాలనే కెరీర్‌గా ఎంపిక చేసుకున్నాను.


*  మీ తొలి చిత్రమే (శుద్ద్ దేశీ రొమాన్స్) యశ్‌రాజ్ సంస్థలో చేశారు. ఆ అవకాశం     ఎలా వచ్చింది?
 ముంబయ్‌లో మోడలింగ్ చేసేటప్పుడు  ఓ కాస్టింగ్ డెరైక్టర్ ద్వారా యశ్‌రాజ్ సంస్థలో ఆడిషన్స్‌కి వెళ్లాను. ఆ తర్వాత చాలాసార్లు ఆడిషన్స్ చేశారు. ఓ ఆరేడు నెలలు ఉండి, సినిమా కుదిరితే ఓకే.. లేకపోతే ఢిల్లీ వెళ్లిపోవాలనుకున్నాను. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా అవకాశం ఇచ్చారు. ఈ బేనర్లో తొలి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా.  నా రెండో సినిమా కూడా ఇందులో చేయడం ఆనందంగా ఉంది.


*  ఇంతకీ ‘ఆహా కల్యాణం’ మాతృక ‘బ్యాండ్ బాజా బారాత్’ చూశారా?
 ఆ సినిమా విడుదలవ్వగానే చూశాను. అయితే, ఈ చిత్రం ‘ఆహా కల్యాణం’గా రీమేక్ అవుతుందని, అందులో నాకే అవకాశం వస్తుందని అనుకోలేదు. వచ్చిన తర్వాత మాత్రం చూడలేదు. ఎందుకంటే, అనుష్క శర్మ ప్రభావం నా మీద ఉండకూడదనుకున్నా.


*  ‘పెళ్లి’ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.. అసలు పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి?
 ఏదో రోజు పెళ్లి చేసుకుని సెటిలవుతా. వివాహ బంధం చాలా గొప్పది.


*  పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఏంటనుకుంటున్నారు?
 వయసుతో సంబంధం లేదు. జీవితంలో సెటిల్ అవ్వడం ప్రధానం. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మానసికంగా రెడీ అయినప్పుడే పెళ్లి చేసుకోవాలి. నా సిస్టర్ నుపుర్‌కి పద్ధెనిమిదేళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ‘నువ్వు మాత్రం అలా చేసుకోవద్దు’ అని చెప్పింది. కొన్నాళ్లు జీవితాన్ని ఎంజాయ్ చేసి, పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది.


*  ఈ సినిమాలో నానితో మీ పెళ్లి చాలా వైభవంగా జరిగి ఉంటుంది. నిజజీవితంలో ఎలాంటి వ్యక్తిని పెళ్లాడాలను కుంటున్నారు. వైభవంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?

ఎలాంటి వ్యక్తిని పెళ్లాడాలో నిర్ణయించుకోలేదు. నా పెళ్లి నిరాడంబరంగా జరిగినా ఫర్వాలేదు. కానీ, నా పెళ్లికి వచ్చేవాళ్లందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలి.


*  నాని గురించి చెప్పండి?
 నాని యాక్ట్ చేసిన ‘ఈగ’ సినిమాలో కొన్ని సీన్స్ చూశాను. తను మంచి నటుడు. ఎప్పుడైతే కోస్టార్ మంచి పర్ఫార్మరో, అప్పుడు ఆటోమేటిక్‌గా తనకు పోటీగా బాగా యాక్ట్ చేయాలనే పట్టుదల ఏర్పడుతుంది.


*  అవసరమైతే బికినీ ధరిస్తానని, లిప్ లాక్‌కి రెడీ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎప్పటికీ ఆ మాట మీదే ఉంటారా?
 తప్పకుండా. చీరలు, చుడీదార్లు వేసుకుని ఈత కొట్టలేముగా? మరి.. సినిమాలో అలాంటి సీన్స్‌లో బికినీ వేసుకుంటే తప్పేంటి? అలాగే మంచి రొమాంటిక్ స్టోరీ అనుకోండి... హీరో హీరోయిన్ మధ్య లిప్‌లాక్ సీన్స్ ఉంటాయి కదా. అవి చేస్తేనే సీన్ పండుతుంది. కథకి అవసరమైనవి చేయడానికి నేను వెనకాడను.

>