హీరోయిన్‌ల తారుమారు

16 Jul, 2020 02:01 IST|Sakshi

అనుకున్నట్లు జరిగితే మళ్లీ చిరంజీవి–త్రిష జంటను చూసేవాళ్లం

మహానటి కీర్తీ సురేష్‌ హిందీ తెరపై కనిపించి ఉండేది

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి మన అల్లు అర్జున్‌కి విలన్‌ అయ్యేవాడు

మణిరత్నం చారిత్రాత్మక సినిమాలో రాజుల కాలం నాటి పాత్రలో కనిపించి ఉండేది అమలా పాల్‌

హాలీవుడ్‌ అమ్మాయి డైసీ టాలీవుడ్‌కి హాయ్‌ చెప్పేది

ప్చ్‌.. అనుకున్నట్లు జరగలేదు...

డేట్స్‌ తారుమారు... ప్లానింగ్‌ టైమ్‌లోనే వచ్చిన తేడాల వల్ల ఈ తారలు మారారు.

‘తారమారు’ అనేది సినిమా ఇండస్ట్రీలో సహజం.

కొంతగ్యాప్‌ తర్వాత ‘ఆచార్య’ వంటి ఓ స్ట్రయిట్‌ తెలుగు ఫిల్మ్‌తో తెలుగు తెరపై త్రిష కనిపించబోతున్నారన్న వార్త ఆమె అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. కారణం‘ఆచార్య’ చిత్రం నుంచి త్రిష తప్పుకోవడమే. ‘క్రియేటివ్‌ డిఫరేన్సెస్‌ కారణంగా ‘ఆచార్య’ చిత్రం నుంచి తప్పుకుంటున్నా’ అని వెల్లడించారు త్రిష. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఒకవేళ త్రిష ఈ సినిమా నుంచి తప్పుకుని ఉండకపోయి ఉంటే.. చిరంజీవి–త్రిషల కాంబినేషన్‌ని రెండోసారి చూసేవాళ్లం.  2006లో వచ్చిన ‘స్టాలిన్‌’ చిత్రంలో ఈ ఇద్దరూ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘ఆచార్య’ చిత్రంలో త్రిష చేయాల్సిన హీరోయిన్‌ పాత్రను ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ చేస్తున్నారు. చిరంజీవి కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’లో కాజల్‌ హీరోయిన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). ఎన్టీఆర్‌ సరసన ఇంగ్లిష్‌ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్, రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటించబోతున్నట్లు చిత్రబృందం పేర్కొంది. కానీ షూటింగ్‌లో పాల్గొనకముందే వ్యక్తిగత కారణాల వల్ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో తాను నటించడం లేదని చెప్పేశారు డైసీ. దీంతో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటిష్‌ నటి ఒలివియా మోరిస్‌ను ఎంపిక చేసుకున్నారు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం.


కరోనా వల్ల షూటింగ్స్‌ ఆగిపోవడంతో కాల్షీట్స్‌ను సర్దుబాటు చేయలేక ‘పుష్ప’కు బై బై చెప్పాల్సి వచ్చిందని కాస్త నిరుత్సాహపడ్డారు విజయ్‌ సేతుపతి. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు చిత్రబృందం విజయ్‌ సేతుపతిని ఎంపిక చేసింది. కానీ కాల్షీట్స్‌ కుదరక ‘పుష్ప’ చిత్రంలో నటించడం లేదని ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పారు విజయ్‌ సేతుపతి. ఇక ఈ పాత్ర కోసం తమిళ నటుడు బాబీ సింహా, కన్నడ నటుడు దర్శన్‌లను చిత్రబృందం సంప్రదించిందని టాక్‌. మరి.. ఎవరు నటిస్తారో చూడాలి.


ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించాలని చాలామంది కథానాయికలు ఆశపడుతుంటారు. కానీ వచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నారు నటి అమలా పాల్‌. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ పీరియాడికల్‌ మూవీ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’.  ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రను ఆఫర్‌ వస్తే అమలా పాల్‌ నో చెప్పారు. ‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో నన్ను అడిగిన పాత్రకు నేను న్యాయం చేయలేనేమోనని అనిపించింది. నాకు సూట్‌ కాని పాత్రను చేసి, ఆ తర్వాత విమర్శలను ఎదుర్కోవడం కన్నా ముందే తప్పుకోవడం ఉత్తమం అనుకున్నాను’’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు అమలా పాల్‌.


సౌత్‌లో హీరోయిన్‌గా ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు కథానాయిక కీర్తీ సురేష్‌. కానీ బాలీవుడ్‌లో కెరీర్‌ ఖాతాను కీర్తి ఇప్పటివరకు ఓపెన్‌ చేయలేదు. ఫుట్‌బాల్‌ కోచ్‌ కమ్‌ మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కుతోన్న ‘మైదాన్‌’ చిత్రంతో కీర్తి బీటౌన్‌కు హీరోయిన్‌గా పరిచయం కావాల్సింది. కానీ అనుకోని పరిణామాల వల్ల ఆమె ‘మైదాన్‌’ నుంచి బయటకు వచ్చేశారు. అందుకు తగ్గ కారణం బయటకు రాలేదు.  ఇప్పుడు ఆ పాత్రను ప్రియమణి చేస్తున్నారు. అజయ్‌ దేవగన్‌ హీరోగా ‘బదాయి హో’ ఫేమ్‌ అమిత్‌ శర్మ డైరెక్ట్‌ చేస్తోన్న ఈ ‘మైదాన్‌’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 13న విడుదల కానుంది. అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన మరో చిత్రం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. ఈ చిత్రంలో కీలక పాత్రలు చేయాల్సిన పరిణీతీ చోప్రా, రానా కొన్ని కారణాల వల్ల నటించలేదు. ఈ సినిమా త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.


హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ వదిలిన బ్యాడ్మింటన్‌ రాకెట్‌ను పట్టుకున్నారు హీరోయిన్‌ పరిణీతీ చోప్రా. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా అమోల్‌ గుప్తే డైరెక్షన్‌లో ‘సైనా’ అనే చిత్రం వెండితెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సైనా’ చిత్రంలో సైనా నెహ్వాల్‌ పాత్రకు సైన్‌ చేశారు శ్రద్ధా కపూర్‌. కానీ  ఆమె తప్పుకోవడంతో సైనాగా నటించేందుకు సై అన్నారు పరిణీతీ చోప్రా.


ఇంకా ఇటు సౌత్‌ అటు నార్త్‌లో ఇలా సినిమా ఒప్పుకుని తప్పుకున్న తారలు కొందరు ఉన్నారు. ఇలా తారలు మారడం అనేది సహజంగా జరుగుతుంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా