చిత్రపతుల చెట్టపట్టాల్‌

17 Sep, 2019 01:08 IST|Sakshi

ఉత్తర దక్షిణ ధ్రువాలు కలవవు. ఉత్తరాదివాళ్లు,  దక్షిణాదివాళ్లు కూడా కలవరు. ‘మాకు మేమే, మీకు మీరే’ అని ‘మిస్సమ్మ’ చిత్రంలో సావిత్రిగారు రాగం తీస్తారు కదా.. అలా! కానీ వెండి తెర ఎవర్నైనా కలిపేస్తుంది. అయస్కాంతం అది! విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఈ ఆకర్షణే ఇప్పుడు బాలీవుడ్‌ని టాలీవుడ్‌తో కలుపుతోంది. ‘ఛత్రపతి’ చిత్రంలో ‘ఎ’ వచ్చి ‘బి’ పై వాలినట్లు.. ‘బి’ వచ్చి ‘టీ’పై వాలుతోంది. ‘టీ’ వెళ్లి ‘బి’ పై వాలుతోంది. ‘చిత్రపతుల’ ఈ కొత్త కలయికతో రాబోతున్న సినిమాలపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌.. ఈవారం ‘మూవీ స్టోరీ’.

ఆ గట్టునుంటావా... ఈ గట్టునుంటావా... ‘రంగస్థలం’లోని పాట ఇది. సినిమాలో సీన్‌కి తగ్గ పాట ఇది. కానీ రియల్‌ సీన్‌కి వస్తే.. సినిమాకి గట్టు లేదు. ఆ గట్టున ఉంటా.. ఈ గట్టున ఉంటా అంటారు. అందుకే నార్త్‌ నుంచి సౌత్‌కి నటీనటులు వస్తారు. సౌత్‌ నుంచి నార్త్‌కి ఇక్కడివాళ్లు వెళతారు. ఇప్పుడు నటీనటులే కాదు.. డబ్బులు పెట్టే (చిత్రపతులు) నిర్మాతలు కూడా ఆ గట్టున ఉంటూనే ఈ గట్టుకొస్తున్నారు.. ఈ గట్టువారు అక్కడివారితో చేతులు కలుపుతున్నారు. ఇలా టీ (టాలీవుడ్‌), బీ (బాలీవుడ్‌) కలిస్తే ప్రేక్షకులకు ఇంకా భారీ సినిమాలు చూపించడానికి కుదురుతుంది. ఈ ఏడాది అలా చేతులు కలిపిన కాంబినేషన్లను చాలా చూడబోతున్నాం. రండి తెలుసుకుందాం..

‘గజినీ’ తర్వాత రామాయణం
వందకోట్లు, రెండొందల కోట్లు, మూడొందల కోట్లు... ఇలా కలెక్షన్స్‌ క్లబ్‌ల గురించి మాట్లాడుకోవడానికి ‘బాహుబలి’, ‘దంగల్‌’, ‘పీకే’... లాంటి భారతీయ సినిమాలు చాలా ఉన్నాయి. కానీ తొలి వందకోట్ల ఇండియన్‌ మూవీ అంటే ఎక్కువమంది ఆమిర్‌ ఖాన్‌ ‘గజినీ’ (2008) చిత్రం గురించే చెప్పుకుంటారు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్, బాలీవుడ్‌ నిర్మాత మధు మంతెనలు ఈ సినిమాకు ముఖ్య నిర్మాతలు. 11 ఏళ్ల క్రితం కలిసి హిందీ సినిమా నిర్మించిన ఈ నిర్మాతలిద్దరూ మరోసారి చేతులు కలిపారు. వీరికి మరో బాలీవుడ్‌ నిర్మాత నమిత్‌ మల్హోత్రా తోడయ్యారు. ఈ ముగ్గురూ కలిసి రామాయణం ఇతిహాసం ఆధారంగా ఓ భారీ చారిత్రాత్మక సినిమాను నిర్మించనున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కన్న ఈ సినిమాకు ‘దంగల్‌’ ఫేమ్‌ నితీష్‌ తివారి, ‘మామ్‌’ దర్శకుడు రవి ఉడయార్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

2021లో తొలి పార్ట్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. 20 ఏళ్ల తర్వాత... తెలుగు ఇండస్ట్రీలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ది 55 ఏళ్ల సక్సెస్‌ఫుల్‌ జర్నీ. అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు  నిర్మించాలన్నది సంస్థ అధినేత డా. డి. రామానాయుడి కల. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ.. ఇలా అన్ని భాషల్లో చిత్రాలను నిర్మించి తన కలను నెరవేర్చుకున్నారు రామానాయుడు. అయితే తమ సంస్థపై తీసిన ‘రాముడు భీముడు’ చిత్రాన్ని కలర్‌లో తీయాలనే కల నెరవేరకుండానే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తండ్రి సక్సెస్‌ఫుల్‌ సినీ జర్నీలో ఎక్కువ భాగం తనయుడు సురేశ్‌బాబుకి ఉంది. అలాగే సురేశ్‌బాబు తనయుడు నటుడు అయినప్పటికీ తాత, తండ్రిలా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు  సురేశ్‌బాబు, రానా బాలీవుడ్‌ సంస్థ థార్‌ మోషన్‌ పిక్చర్స్‌తో కలిసి శ్రీలంక ప్రముఖ క్రికెటర్‌ ముత్తయ్య మరళీధరన్‌ బయోపిక్‌ను నిర్మించనున్నారు.

మహేష్ బాబు,సూర్యదేవర నాగవంశీ, సందీప్‌ రెడ్డి, రానా, విష్ణు ఇందూరి, మధు మంతెన

మురళీధరన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తారు. ఎమ్‌ఎస్‌. శ్రీపతి దర్శకత్వం వహిస్తారు. అలాగే బాలీవుడ్‌ దర్శక–నిర్మాత లవ్‌ రంజన్‌తో ఓ జాయింట్‌ వెంచర్‌ ఆలోచన ఉందని ఓ సందర్భంలో డి. సురేష్‌బాబు పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే హిందీలో లవ్‌రంజన్‌ నిర్మించిన ‘దేదేప్యార్‌దే’, లవ్‌ రంజన్‌ దర్శకత్వం వహించిన ‘సోనూ కీ టిట్టుకీ స్వీటీ’ సినిమాల తెలుగు రీమేక్స్‌ను సురేశ్‌బాబు నిర్మించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అన్నట్లు.. గతంలో హిందీలో ‘తోఫా’, ‘దిల్‌వాలా’, ‘అనారీ’.. ఇలా దాదాపు పది చిత్రాలకు పైనే సురేశ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. అయితే దాదాపు 20 ఏళ్లుగా హిందీ చిత్రాలు నిర్మించలేదు. ఈ ఏడాది నుంచి వరుసగా హిందీ చిత్రాలు కూడా ప్లాన్‌ చేస్తున్నారు.

డబుల్‌ ధమాకా
పంపిణీ రంగం నుంచి నిర్మాతగా రావడం వెనక ‘దిల్‌’ రాజు సక్సెస్‌ స్టోరీ చాలా ఉంది. టాలీవుడ్‌ ప్రముఖ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో పలు విజయవంతమైన చిత్రాలు అందిస్తున్నారు ‘దిల్‌’ రాజు. ఈ ఏడాది ఈ సంస్థ నుంచి వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘ఎఫ్‌ 2’ ఒకటి. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లు దాటింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి బాలీవుడ్‌ అగ్రనిర్మాత బోనీ కపూర్‌తో డీల్‌ కుదుర్చుకున్నారు ‘దిల్‌’ రాజు. తెలుగుకి అనిల్‌ రావిపూడి దర్శకుడనే సంగతి తెలిసిందే. హిందీ చిత్రాన్ని అనీజ్‌ బాజ్మీ దర్శకత్వంలో రూపొందించనున్నారు. మరోవైపు హిందీ హిట్‌ ‘బదాయి హో’ తెలుగు రీమేక్‌ను ‘దిల్‌’ రాజుతో కలిసి  బోనీ కపూర్‌ నిర్మించనున్నారు. ఈ ఇద్దరు నిర్మాతలూ ఒకేసారి ఇటు తెలుగు అటు హిందీ రీమేక్‌కి ప్లాన్‌ చేయడం విశేషం.

హీరోగా కాదు.. నిర్మాతగా ఎంట్రీ
టాలీవుడ్‌లో హీరోగా సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ను మహేశ్‌బాబు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. సూపర్‌ నిర్మాతగా మారేందుకు ‘శ్రీమంతుడు’ (2015), ‘బ్రహ్మోత్సవం’ (2016)... ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు మహేశ్‌. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘మేజర్‌’ సినిమాతో బాలీవుడ్‌లో నిర్మాతగా ప్రస్థానం మొదలు పెట్టబోతున్నారు. సోనీ పిక్చర్స్‌ రిలీజింగ్‌ ఇంటర్‌నేషనల్‌ సమర్పణలో జీఎమ్‌బీ (ఘట్టమనేని మహేశ్‌బాబు) ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ ఎ ఫ్లస్‌ ఎస్‌ మూవీస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు ‘మేజర్‌’ చిత్రాన్ని నిర్మిస్తాయి. సోనీ పిక్చర్స్‌ వంటి పెద్ద సంస్థ తెలుగు సినిమాకు అసోసియేట్‌ కావడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు.  ముంబై 2008, 26/11 ఎటాక్స్‌లో ధైర్యంగా పోరాడిన ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డు) కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ఇది. సందీప్‌ పాత్రలో అడివి శేష్‌ నటించనున్నారు.

ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వానీ, రాజ్‌ నిడుమోరు, డి. కృష్ణ, భూషణ్‌ కుమార్‌, కరణ్‌ జోహార్‌

తొలి చిత్రం ‘గూఢచారి’తో డైరెక్టర్‌గా బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీ ఇచ్చిన శశికిరణ్‌ తిక్క ‘మేజర్‌’ చిత్రానికి దర్శకుడు. నిజానికి మహేశ్‌బాబుకి హీరోగా హిందీ నుంచి అప్పుడప్పుడూ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. హీరోగా హిందీకి ఎంట్రీ ఇస్తారనుకుంటే నిర్మాతగా అడుగుపెడుతున్నారు. మరి.. భవిష్యత్‌లో హిందీకి వెళతారా? లేక తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం చేస్తారా? చూడాలి. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే నిర్మాతగా ఎదుగుతున్నారు విష్ణు ఇందూరి. ‘యన్‌.టీ.ఆర్‌: కథానాయకుడు, యన్‌.టీ.ఆర్‌: మహానాయకుడు’ సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించారు విష్ణు ఇందూరి. ఇప్పుడు బాలీవుడ్‌ నిర్మాత శైలేష్‌ ఆర్‌. సింగ్‌తో కలిసి హిందీలో ‘జయ’ (తమిళ, తెలుగు టైటిల్‌ ‘తలైవి’) అనే సినిమా చేస్తున్నారు. ప్రముఖ నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ఇది.

కంగనా రనౌత్‌

ఇందులో కంగనా రనౌత్‌ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ సారథ్యంలో క్రికెట్‌లో మన దేశం తొలి ప్రపంచకప్‌ను అందుకున్న నాటి సంఘటనల ఆధారంగా బాలీవుడ్‌లో ‘83’ అనే సినిమా  తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు విష్ణు ఇందూరి. ఉత్తమ నూతన దర్శకులుగా సైమా అవార్డ్స్‌లో అవార్డులు పొందిన దక్షిణాది దర్శకులతో విష్ణు ఇందూరి, సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా సినిమాలు నిర్మించడానికి ప్లాన్‌ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఫామ్‌లో ఉన్న తెలుగు దర్శక ద్వయం రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే తాజాగా తెలుగులో ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ హీరో అని కొన్ని వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 2013లో రాజ్, డీకే ‘డీ ఫర్‌ దోపిడీ’ అనే సినిమా నిర్మించిన విషయం గుర్తుండే ఉంటుంది.

భవిష్యత్‌లో భాగస్వామ్యం!
దక్షిణాది నిర్మాతలు హిందీ చిత్రాలను పంపిణీ చేయడం, అక్కడివారు తెలుగు చిత్రాలను పంపిణీ చేయడం సహజంగా జరుగుతుంటుంది. ‘బాహబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమాలను బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహర్‌ (ధర్మప్రొడక్షన్స్‌ అధినేత) డిస్ట్రిబ్యూట్‌ చేశారు. చిరంజీవి ‘సైరా’ చిత్రాన్ని అక్కడి నిర్మాణ సంస్థలు ఎక్సెల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ (ఫర్హాన్‌ అక్తర్, రితీష్‌ సిద్వానీ),  ఏఏ ఫిల్మ్స్‌ (అనిల్‌ టాడానీ) సంస్థలు హిందీలో పంపిణీ చేస్తున్నాయి. 2018లో కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌: కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌’ను హిందీలో విడుదల చేసింది కూడా ఎక్సెల్‌ ఎంటర్‌టైన్మెంట్, ఏఏ ఫిల్మ్స్‌ సంస్థలే. అలాగే మరో భారీ బడ్జెట్‌ చిత్రం ప్రభాస్‌ ‘సాహో’ను హిందీలో భూషణ్‌ కుమార్, అనిల్‌ టడానీ డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఇలా పంపిణీ చేయడంతోనే కాదు.. ‘కథ నచ్చితే స్క్రిప్ట్‌దశ నుంచే నిర్మాణంలో భాగస్వామ్యంగా కూడా ఉంటాం’  అని  ముంబైలో జరిగిన ‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్‌ ఆవిష్కరణ వేడుకలో బాలీవుడ్‌ నిర్మాత రితేష్‌ సిద్వానీ చెప్పారు. దీన్నిబట్టి ఉత్తరాది నుంచి మరింత మంది నిర్మాతలు తెలుగు చిత్రాల్లో భాగం పంచుకునే అవకాశం ఉందని ఊహించవచ్చు.

చిరంజీవి

బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు కొన్ని మన టాలీవుడ్‌లో పెట్టుబడులు పెడుతుంటే మన నిర్మాతలు కూడా బాలీవుడ్‌లో డైరెక్ట్‌ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్‌’ రాజు,  సూర్యదేవర నాగవంశీ కలిసి తెలుగు హిట్‌ ‘జెర్సీ’ హిందీ రీమేక్‌ను నిర్మించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో సమంత నటించిన ‘ఓ బేబి’ సినిమాను హిందీలో రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ వంగా హిందీలో ఓ సినిమాకు నిర్మాతగా మారబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’, విక్కీ కౌశల్‌ ‘సర్దార్‌ ఉద్దామ్‌ సింగ్‌’ వంటి సినిమాలను నిర్మిస్తున్న వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ సౌత్‌ సినిమాల నిర్మాణంలో వేగం పెంచాలని చూస్తోంది. ఆల్రెడీ నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ సినిమాకు అన్నపూర్ణ స్టూడియోస్‌తో అసోసియేట్‌ అయ్యింది ఈ బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడక్షన్‌ హౌస్‌. అలాగే ప్రముఖ నిర్మాణ వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ నిర్మాణంలో నాని, నాగార్జున నటించిన ‘దేవదాస్‌’ సినిమా విడుదలలో వయాకామ్‌18 పాత్ర కూడా ఉంది. డైరెక్ట్‌గా కొన్ని తెలుగు సినిమాలను నిర్మించాలనే ఆలోచన కూడా ఈ సంస్థ ఉందట. ఆల్రెడీ కొన్ని తమిళ సినిమాల్లో ఈ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది.

సమంత

ఇన్‌పుట్స్‌: ముసిమి శివాంజనేయులు

మరిన్ని వార్తలు