రెడీ.. స్టార్ట్‌... యాక్షన్‌

12 Jul, 2020 01:39 IST|Sakshi
కాజల్‌ అగర్వాల్‌, తాప్సీ

కరోనా వల్ల ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొటోంది. షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే నిర్మాతల ఇబ్బందులు కొంత మేరకైనా తగ్గి ఇండస్ట్రీ తిరిగి పుంజుకుంటుందని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినప్పటికీ సినిమాల షూటింగ్స్‌ ఊపందుకోవడం లేదు.

కొన్ని రోజుల క్రితం కంటే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండటం, టీవీ షూటింగ్స్‌ను స్టార్ట్‌ చేసిన తర్వాత కొంతమంది బుల్లితెర నటీనటులు కరోనా బారిన పడటం.. ఇలా కారణాలు ఏవైనా సినిమా సెట్‌లో అనుకున్నంతగా లైట్‌ వెలగడం లేదు.

సినీ కార్మికుల పొట్ట నిండటం లేదు. ‘కరోనా ఇక లేదు అన్నాకే షూటింగ్స్‌ చేస్తాం’ అని కొందరు నటీనటులు అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరోనా ఎంత కలవరపెడుతున్నా ‘మేం రెడీ’ అంటూ   కొందరు నటీనటులు, డైరెక్టర్లు రెడీ.. స్టార్ట్‌.. యాక్షన్‌ అనగానే నటించడానికి కెమెరా ముందుకొచ్చారు. వారి గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్‌లో విభిన్నమైన సినిమాలు తీస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దర్శక–నిర్మాత, నటుడు రవిబాబు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత తన దర్శకత్వంలోని ‘క్రష్‌’ సినిమా షూటింగ్‌ను ఆరంభించారు రవిబాబు. అయితే కరోనా జాగ్రత్తలను పాటిసూ,్త పీపీఈ సూట్స్‌ ధరించి షూటింగ్స్‌ చేయడం అంత సులువైన విషయమేమి కాదని అభిప్రాయపడుతున్నారు రవిబాబు.

ఇక ‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కల్యాణ్‌ దేవ్‌ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం‘సూపర్‌ మచ్చి’ షూటింగ్‌ ఇటీవల వారం రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగింది. అటు బాలీవుడ్‌కి వెళితే... బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ నెక్ట్స్‌ షో కోసం కావాల్సిన ప్రోమో చిత్రీకరణలో పాల్గొన్నారు.

కరోనా వైరస్‌ గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించే ఓ వీడియో కోసం బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ ఈ ఏడాది జూన్‌లో కెమెరా ముందుకు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం మస్త్‌ బిజీగా ఉన్న హీరోయిన్లలో తాప్సీ ఒకరు. జూన్‌లో తాప్సీ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. కరోనా తర్వాత షూటింగ్‌ లొకేషన్‌లో అడుగుపెట్టిన తొలి హీరోయిన్‌ తాప్సీనే అట. వాణిజ్య ప్రకటనల చిత్రీకరణలో పాల్గొన్నారు కథానాయికలు విద్యాబాలన్, కాజల్‌ అగర్వాల్, సన్నీ లియోన్‌. దాదాపు నాలుగు నెలల తర్వాత శనివారం షూటింగ్‌లో పాల్గొన్నారు అర్జున్‌ కపూర్‌.

‘‘కొత్త నియమ నిబంధనలను పాటిస్తూ మా వర్క్‌ లైఫ్‌ను రీస్టార్ట్‌ చేశాం. నాలుగు నెలల తర్వాత నేను షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాను’’ అన్నారు అర్జున్‌ కపూర్‌. ఓ యాడ్‌ కోసం డైలాగ్స్‌ చెప్పారు బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా. ‘పాయిజన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ కోసం మళ్లీ పని మొదలు పెట్టారు హీరోయిన్‌ రాయ్‌ లక్ష్మీ. ఇక హాలీవుడ్‌ విషయానికి వస్తే... జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్‌ 2’ చిత్రీకరణను న్యూజిల్యాండ్‌లో ఆరంభించారు. వీరితో పాటు కరోనా జాగ్రత్తల మధ్య మరికొంతమంది షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. ఇంకొందరు సిద్ధమౌతున్నారు.

అర్జున్‌ కపూర్‌, సన్నీలియోన్‌

రాయ్‌ లక్ష్మీ, విద్యాబాలన్‌

మరిన్ని వార్తలు