ఈ అవార్డు మా అమ్మకు అంకితం

10 Aug, 2019 02:28 IST|Sakshi
కీర్తీ సురేశ్‌

– కీర్తీ సురేశ్‌

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా కీర్తీ సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘మహానటి’ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్, నాగ్‌ అశ్విన్‌తో ‘సాక్షి’ స్పెషల్‌ టాక్‌.

► హార్టీ కంగ్రాట్స్‌. 1990లో ‘కర్తవ్యం’ సినిమాకి విజయశాంతి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 28 ఏళ్ల తర్వాత తెలుగు నుంచి ఉత్తమ కథానాయిక అవార్డు గెలుచుకున్న నటి మీరే...
కీర్తీ సురేశ్‌: చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ అవార్డును మా అమ్మకు అంకితం చేస్తున్నాను. అమ్మ (మలయాళ నటి మేనక) నటించిన ఓ మలయాళం సినిమా నేషనల్‌ అవార్డుకి నామినేట్‌ అయింది. కానీ అవార్డు రాలేదు. అలా అమ్మ కల నెరవేరలేదు. అప్పుడే తనకోసం ఓ అవార్డు తీసుకురావాలని అనుకున్నాను. ‘నీ కోసం జాతీయ అవార్డు తీసుకొస్తాను’ అని అమ్మతో కూడా చెప్పాను. ఇప్పుడు అది నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లవుతోంది. ఇంత త్వరగా జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. అమ్మ కల మాత్రమే కాదు.. ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవాలనే నా కల నెరవేరినట్టుంది. ఇది కేవలం మొదలే.. నా జర్నీ ఇంకా చాలా ఉంది (నవ్వుతూ).

► ఈ సందర్భంగా సావిత్రిగారి గురించి రెండు మాటలు...
సావిత్రిగారి ఆశీస్సులు, సపోర్ట్‌ లేకపోతే ఇంత దూరం కచ్చితంగా వచ్చేవాళ్లం కాదు. సావిత్రి అమ్మ, ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి అమ్మకు చాలా చాలా థ్యాంక్స్‌. సినిమా చేస్తున్నప్పుడు వచ్చిన అడ్డంకులన్నీ సావిత్రమ్మ ఆశీస్సులతోనే ఎదుర్కొన్నాం. ఆవిడ ఎప్పుడూ మమ్మల్ని గైడ్‌ చేస్తూనే వచ్చారని నా ఫీలింగ్‌

► ‘మాయాబజార్‌’లోని ‘అహ నా పెళ్లంట’ ఎపిసోడ్‌లో బాగా చేశారు. ఎన్ని టేక్స్‌ తీసుకున్నారు?
ఆ సినిమాలో ఆ పాట అందరికి ఫేవరెట్‌ కూడా. ఆ సన్నివేశానికి 40– 50 టేకులు తీసుకున్నాను. షూట్‌ చేసే మూడు రోజుల ముందే ప్రిపరేషప్‌ మొదలుపెట్టాను. టేక్‌ చేసిన ప్రతిసారీ పర్ఫెక్ట్‌గా రావాలనుకునే చేశాను. ఫైనల్లీ చేయగలిగాను. చాలా బాగా చేశావని అందరూ అభినందించారు. అయితే ఇప్పుడు చూసుకుంటే నాకు చిన్నచిన్న తప్పులు కనిపిస్తాయి (నవ్వుతూ).
 

► ఇంత బాధ్యత ఉన్న పాత్ర చేస్తున్నాం అని నిద్రలేని రాత్రులు ఏమైనా?
‘మహానటి’ కోసం చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. పాత్రలోనుంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉండేది. ఎమోషనల్‌ సీన్స్‌ చేసినా ఏం చేసినా షూటింగ్‌ పూర్తయిన తర్వాత చాలా కష్టంగా ఉండేది. రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను. నిద్రలేకపోతే ఆ ఎఫెక్ట్‌ మర్నాడు షూటింగ్‌ మీద పడుతుందని భయం. సావిత్ర అమ్మ పాత్ర నా మీద చాలా ప్రభావం చూపించింది.

► కాస్ట్యూమ్స్‌కి కూడా అవార్డ్‌ వచ్చింది. అలనాటి సావిత్రిగారు వేసుకున్న కాస్ట్యూమ్స్‌ పోలినవి ఈనాటి కీర్తి వేసుకున్నప్పుడు ఏమనిపించింది?
కాస్ట్యూమ్‌ డిజైనర్లు్ల కూడా చాలా కష్టపడ్డారు. ఆవిడ ఫిట్టింగ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫిట్టింగ్‌ దొరకడం లేదు కూడా. ఆ ఫిట్టింగ్‌ ఉంటే తప్ప షాట్‌కి రాను అని చెప్పేదాన్ని. ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేనంత ‘టైట్‌ బ్లౌజులు’ వేసుకునేవారు. కష్టం అనిపించినప్పటికీ నేనూ అదే ఫిటింగ్‌నే ప్రిఫర్‌ చేశాను. ఇక లావుగా కనపడాల్సిన సీన్స్‌లో  ప్రొస్థెటిక్‌ మేకప్‌ కూడా ఉపయోగించాం. సమ్మర్‌లో చిత్రీకరించాం. ప్రొస్థెటిక్‌ మేకప్‌కి నాలుగు గంటలు పట్టేది.

► ఈ సినిమాలో మిమ్మల్ని సావిత్రి పాత్రకు ప్రకటించినప్పుడు కొందరు ‘మిస్‌ ఫిట్‌’ అన్నారు. విమర్శలు కూడా వచ్చాయి..?
సావిత్రిగారు మహానటి. ఆమె పాత్రకు న్యాయం చేయగలను అనే నమ్మకంతోనే ఒప్పుకున్నారు. అయితే ముందు క్రిటిసిజమ్‌ వచ్చిందని నాకు తెలియదు. తర్వాత చాలామంది చెప్పారు. అలాగే  సినిమా ప్రమోట్‌ చేస్తున్నప్పుడు తెలిసింది. అప్పుడు కొంచెం టెన్షన్‌ అనిపించింది. పోస్టర్, టీజర్‌ వచ్చినప్పుడు అందరికీ నమ్మకం కలిగింది. అందరూ అభినందించారు. మంచి రెస్పాన్స్‌ రావడంతో హ్యాపీగా ఫీల్‌ అయ్యాను.
   

► ‘మహానటి’ సినిమా గుర్తుగా ఏదైనా మీతో దాచుకున్నారా?
 ఈ సినిమాకు నా మనసులో స్పెషల్‌ ప్లేస్‌ ఉంది. ‘మహానటి’ చివరి రోజు చిత్రీకరణలో నేను ధరించిన చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్‌. అదే నా దగ్గరున్న మెమొరీ.

పేరు చెడగొట్టకూడదనుకున్నాను
– నాగ్‌ అశ్విన్‌ ‘మహానటి’ దర్శకుడు
నేషనల్‌ లెవల్లో గుర్తింపు రావడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ‘మహానటి’కి మూడు అవార్డులు వచ్చాయి. నేషనల్‌ లెవల్లో గట్టి పోటీ ఇచ్చిన కీర్తీ సురేశ్‌ అవార్డు  సాధించడం సంతోషంగా ఉంది. సావిత్రిగారి టైమ్‌లో ఆమెకు నేషనల్‌ అవార్డు  రాలేదు. కానీ అవార్డ్‌కు తగినంత పెర్ఫార్మెన్స్‌లు చాలా ఇచ్చారు. ఆమె మీద తీసిన సినిమాతో నేషనల్‌ అవార్డు తీసుకురాగలిగాం. ఇది ఊహించలేదు. కానీ మంచి ప్రశంసలు, అభినందనలు వస్తాయని చాలా మంది చెప్పారు. సినిమా రిలీజ్‌ అయి కూడా చాలా రోజులైంది.

మర్చిపోయాను కూడా. సినిమాలో చాలెంజ్‌లు, కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాతో మాకు బాధ్యత ఎక్కువ ఉండేది. సావిత్రి అమ్మ మీద సినిమా తీస్తున్నాం. అవకాశాన్ని వృథా చేసుకోకూడదు అని కష్టపడ్డాం. సావిత్రిగారికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లు మా సినిమా చూస్తే సంతృప్తి చెందాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. బాక్సాఫీస్‌ గురించి కూడా ఎక్కువగా ఆలోచించలేదు. రిలీజ్‌ అయిన తర్వాత ‘న్యాయం చేశారు, చెడగొట్టలేదు’ అంటే చాలు అనుకున్నాను.

ఆమె లైఫ్‌ అంతా షూటింగ్‌ గ్యాప్‌లో జరిగిందే కదా. సమస్య అయినా ప్రేమ అయినా షూటింగ్స్‌ మధ్యలోనే జరిగాయి. సినిమా కూడా అలానే తీశాను. మనకు చాలా కథలున్నాయి. వాళ్లందరి గురించి కూడా సినిమాలు తీయాలి. తీసేవాళ్లు మాత్రం చాలా నిజాయితీగా వెతికి, నిజాయితీగా తీయాలి. నెక్ట్స్‌ కొత్త కథలు చెప్పాలనుంది. ప్రస్తుతం ఓ కథను రాస్తున్నాను. తొందర తొందరగా సినిమా తీసేయాలని లేదు. ఇప్పుడు చేయబోతున్న సినిమా మాత్రం నా గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు