కథల ఎంపికలో వారినే ఫాలో అవుతా: రామ్‌ చరణ్‌

8 May, 2018 19:44 IST|Sakshi

సుకుమార్‌ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ నటనపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురుపించిన సంగతి తెలిసిందే. వినికిడి లోపం గల పల్లెటూరి యువకుడి పాత్రలో రామ్‌ చరణ్‌ ప్రేక్షకులను మెప్పించాడు. రంగస్థలంలో అలాంటి పాత్ర చేయడానికి సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌లు ఆదర్శం అంటున్నారు రామ్‌ చరణ్‌.

పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. ‘వాణిజ్య విలువలతో పాటు.. కథాబలం ఉన్న చిత్రాల్లో నటించాలనుకునే వారికి బాలీవుడ్‌ స్టార్స్‌ ఆమిర్‌, సల్మాన్‌లు ఆదర్శంగా నిలుస్తారు. నేను కథల ఎంపికలో వారినే ఫాలో అవుతాను. దంగల్‌, బజరంగీ భాయ్‌జాన్ చిత్రాలు ఎంతోమంది నటులకు, దర్శకులకు, నిర్మాతలకు స్ఫూర్తిదాయకం. ఈ తరం నటులకు ఆమిర్‌, సల్మాన్‌ ఐకాన్‌గా నిలుస్తారు’  అని చెప్పారు.

తన రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమా బిజినెస్‌ మీద అసలు దృష్టి సారించలేదు. 1980ల నాటి ఆ పాత్రకు ఎలా న్యాయం చేయగలనని మాత్రమే ఆలోచించాను. మేము చేస్తున్న ఓ పీరియాడిక్‌ డ్రామాని, ముఖ్యంగా అందులోని క్యారెక్టర్‌ని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారనే ఒత్తిడి అయితే ఉండేది. కానీ ఈ చిత్ర విజయం మాలో ఉత్తేజాన్ని నింపింది. ఒక నటుడిగా నేను ఎంతో సంతృప్తి చెందిన చిత్రమిది. ఈ చిత్రంలో నిర్మించిన విలేజ్‌ సెట్‌ అభిమానులను ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అయ్యేలా చేసింది’  అని తెలిపారు.

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్‌లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై చరణ్‌ స్పందిస్తూ.. చాలా రోజుల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది ఒక చాలెజింగ్‌ రోల్‌ అని అనుకుంటున్నాను.. ఇంకా రాజమౌళి స్కిప్ట్‌ వర్క్‌లో ఉన్నారని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు