ఆ సినిమాను విడుదల కానివ్వం: వీహెచ్‌పీ

23 May, 2018 19:20 IST|Sakshi

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే నటించిన ‘పద్మావత్‌’ సినిమా విడుదలకు ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా ఉం‍దనే ఆరోపణలతో కొన్ని వారాల పాటు వాయిదాపడ్డా.. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించి, విడుదలైంది. ఇదంతా ఎందుకంటారా.. తాజాగా ‘లవోరాత్రి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సల్మాన్‌ ఖాన్‌ బావ ఆయుష్‌ శర్మ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్‌ కూడా హిందువులు పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని హేళన చేస్తున్నట్లుగా ఉందని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది.

గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే ప్రేమను చూపించనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే సినిమా పేరును ‘లవోరాత్రి’ అని నిర్ణయించారు. ఈ విషయం గురించి విశ్వ హిందూ పరిషత్‌ ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘హిందువుల పర్వదినం నవరాత్రి నేపథ్యంలో మూవీ తీయడంతో పాటు ఆ పేరు అర్థాన్ని కూడా నాశనం చేశారు. ఈ సినిమాను దేశంలో ఎక్కడా ప్రదర్శించడానికి వీలులేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినాలని మేం కోరుకోవడం లేదు. కాబట్టి ఈ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటా’మని తెలిపారు.

‘సుల్తాన్‌’, షారుక్‌ ఖాన్‌ ‘ఫ్యాన్‌’, చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అభిరాజ్‌ మినావాలా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయుష్‌ శర్మకు జోడీగా నటిస్తున్న వారినా హుస్సెన్‌కు కూడా ఇండస్ట్రీకి తొలి పరిచయం కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు