ఆ సిన్మా కోసం ఏకంగా థియేటర్‌ బుకింగ్‌

22 Mar, 2018 15:10 IST|Sakshi
సల్మాన్‌ ఖాన్‌

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే పాకిస్తాన్‌కు చెందిన ఓ అభిమాని మాత్రం సల్మాన్‌ ‘టైగర్‌ జిందా హై సినిమా’ చూసేందుకు ఏకంగా థియేటర్‌ను బుక్‌ చేశాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే ‘టైగర్‌ జిందా హై’ సినిమాపై పాక్‌ సెన్సార్‌ బోర్డు నిషేధం విధించింది. ఈ సినిమాలో పాక్‌ దర్యాప్తు, నిఘా ఏజెన్సీలను కించపరిచేవిధంగా చూపించారని, ఈ సినిమా వల్ల తమ జాతీయ భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని పాక్‌ సెన్సార్‌ బోర్డు చీఫ్‌ మొబషీర్‌ హసన్‌ వ్యాఖ్యానించారు. అయినా.. సల్లూ భాయ్‌ వీరాభిమాని మాత్రం వెనుకడుగు వేయలేదు. ఒక్కసారి సినిమా చూసేందుకు వీలుగా డిజిటల్‌ హక్కులు సంపాదించి.. లాహోర్‌లో థియేటర్‌ బుక్‌ చేసి స్నేహితులు, సల్మాన్‌ అభిమానుల కోసం ప్రత్యేకంగా షో ఏర్పాటుచేశాడు.

ఈ సినిమా తనకెంతగానో నచ్చిందని, భారత్‌- పాక్‌ల మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరించిందని సల్మాన్‌ అభిమాని సంతోషం వ్యక్తం చేశాడు. సల్మాన్‌ యాక్షన్‌ సీన్లు అద్భుతంగా ఉన్నాయంటూ మురిసిపోయాడు. పాక్‌లో ఈ సినిమాను నిషేధించినప్పటికీ ఇరుదేశాల మధ్య సుహృద్బావం ఉండాలని తాము కోరుకుంటామని తెలిపాడు. ఈ విషయంపై సల్మాన్‌ తండ్రి సలీం ఖాన్‌ ‘మిడ్‌-డే’తో మాట్లాడుతూ.. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. పాక్‌లో భారత్‌ సినిమాలు, భారత్‌లో పాక్‌ సినిమాల విడుదలకు ఇరుదేశాలు సహకరించాలి. రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులు మెరుగుపడినపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంద’న్నారు

మరిన్ని వార్తలు