దీనస్థితిలో నటి.. సల్మాన్ ఆపన్నహస్తం!

25 Mar, 2018 17:19 IST|Sakshi
పూజా దద్వాల్, సల్మాన్ ఖాన్ (ఫైటో)

సాక్షి, న్యూఢిల్లీ: తనతో కలిసి నటించిన హీరోయిన్ అత్యంత దీనమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించిన బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్ ఆమెకు సాయం చేశాడు. సల్మాన్ హీరోగా 90ల్లో వచ్చిన 'వీర్‌గాటి‌' చిత్రంలో నటించిన పూజా దద్వాల్ అనే హీరోయిన్ ప్రస్తుతం టీబీ వ్యాధి భారిన పడి వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్‌ సాయం కోసం ఆమె గతంలో మీడియా ద్వారా వేడుకోగా.. ఎట్టకేలకు ఆ విషయం సల్మాన్‌కి తెలిసింది.

దబాంగ్‌ టూర్‌ లో భాగంగా పుణెకి వచ్చిన సల్మాన్‌ అనారోగ్యంతో బాధపడుతున్న పూజా దద్వాల్‌ పరిస్థితి విని విచారం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెకు సహాయం చేస్తానన్నారు. సల్మాన్‌ మాట్లాడుతూ...‘ఆమె అనారోగ్యంతో ఉన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. వెంటనే మా టీంని ఆసుపత్రికి పంపిచా. ఆమెకు కావాల్సిన సాయం అందిస్తా. ఆరోగ్యంతో పూజా దద్వాల్‌ బయటకు వస్తుందనే నమ్మకం ఉందని’  ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఆమెను ఆదుకోవటానికి రేసుగుర్రం మూవీ ప్రతినాయకుడు రవికిషన్ ముందుకొచ్చి... తన స్నేహితుని ద్వారా పూజాకి సాయం చేశారు. చికిత్సకు కావాల్సిన డబ్బుతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు.

పూజా దద్వాల్ కొన్ని రోజుల కిందట ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘6 నెలల కిందట టీబీ ఉందని తెలిసింది. అప్పటి నుంచి సల్మాన్ ను సాయం అడుగుదామని యత్నిస్తున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. నా వీడియోను చూస్తే ఎంతో కొంత సాయం చేస్తాడన్న ఆశ ఉంది. కొన్ని రోజులుగా ఇదే హాస్పిటల్‌లో ఉన్నాను. నా దగ్గర నయా పైసా కూడా లేదు. కనీసం టీ కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నదంటూ’ పూజా వాపోయిన విషయం తెలిసిందే. పూజా ఆరోగ్యం బాగా లేదని తెలిసిన తర్వాత భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుంచి పంపించేశారు.

సినిమాల్లో అవకాశాలు లేక పోవడంతో ఇండస్ట్రీని వదిలిపెట్టిన పూజా గత కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో మేనేజ్మెంట్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటూనే జీవనం సాగిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు