సల్మాన్‌ ఖాన్‌ ‘రేస్‌-3’ రివ్యూ

15 Jun, 2018 16:38 IST|Sakshi

టైటిల్ : రేస్‌-3
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌
తారాగణం : సల్మాన్‌ ఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, డైసీ షా, ఫ్రెడ్ఢీ దారువాలా, షకీబ్‌ సలీం
సంగీతం : సలీం సులేమాన్‌
దర్శకత్వం : రెమో డిసౌజా
నిర్మాత : రమేష్‌ ఎస్‌ తౌరాని, సల్మా ఖాన్‌

2008లో వచ్చిన ‘రేస్‌’, 2013లో రిలీజైన ‘రేస్‌ 2’, ఇప్పుడు 2018 జూన్‌ 15న (శుక్రవారం) ‘రేస్‌ 3’...  ఈ మూడూ రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలే. వీటన్నింటి కథామూలం ఒక్కటే. ‘‘తలతన్నేవాడుంటే వాడి తాడి తన్నేవాడొకడుంటాడు’’ అనే సామెత మన తెలుగులో చాలా ఫేమస్‌. అదే కాన్సెప్ట్‌తో ఎన్ని సినిమాలొచ్చినా సినీ ప్రియులు ఎంజాయ్‌ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఈ సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి ఒక్క సినిమాని పోల్చి చూడటం సహజం అని ఒప్పుకోక తప్పదు.

అందుకే సిరీస్‌గా వచ్చిన సినిమాలన్నింటిలోకి ఏది బావుందో తప్పనిసరిగా పోలిక వస్తుంది. అలా పోలిస్తే మిగతా రెండు రేసుల కంటే ఈ రేస్‌ కొంచెం ఎక్కువ అంచనాలతోనే విడుదలైందని  చెప్పాలి. రేస్‌ సిరీస్‌ హీరోతో సహా అన్ని పాత్రలూ డాన్‌లు, మాఫియా, ఇంటర్నేషనల్‌ క్రిమినల్స్‌లాంటి ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌తో నిండి ఉంటాయి.  సినిమా అంతా పూర్తిగా ట్విస్టులతో నిండి ఉంటుంది. ఈ సిరీస్‌లో ముఖ్యంగా మూడు ‘రేస్‌’లతోను అనుబంధం ఉన్న నటుడు అనిల్‌కపూర్‌. ఈయన ఒక్కరే ‘రేస్‌’, ‘రేస్‌–2’, ‘రేస్‌–3’ అన్నింటిలో నటించారు.

మొదటి రెండు సినిమాలకు దర్శకులుగా పనిచేసిన బాలీవుడ్‌ ద్వయం ‘అబ్బాస్‌–మస్తాన్‌’లను కాదని మూడో భాగం దర్శకత్వ బాధ్యతలు మరో బాలీవుడ్‌ దర్శకుడు రెమో డిసౌజాకు అప్పగించారు చిత్ర హీరో మరియు నిర్మాతల్లో ఒకరైన ‘సల్మాన్‌ ఖాన్‌ ’. నిర్మాతల్లో ఒకరైన రమేశ్‌ తౌరాని ‘రేస్‌ 3’ కథను తీసుకుని సల్మాన్‌ఖాన్‌ దగ్గరికి వెళితే ‘సినిమా చేస్తాను కాని కథలో కొన్ని మార్పులతో పాటు దర్శకుడిగా ‘రెమో డిసౌజా’ను తీసుకోవా’లని సూచించారట. ఆ విషయాన్ని సల్మానే స్వయంగా రేస్‌ ప్రమోషన్‌ టైమ్‌లో మీడియాకు చెప్పారు. అలా ఈ ప్రొడక్షన్‌లోకి వచ్చిన దర్శకుడు ‘రెమో’ సినిమాను ఎలా తెరకెక్కించారో తెలుసుకుందాం...

ముఖ్య తారాగణం
షంషేర్‌ సింగ్‌గా ‘అనిల్‌కపూర్‌’ఈ సినిమాకు మెయిన్‌ పిల్లర్‌ అని చెప్పాలి. ఇతను చుట్టూ అల్లిన కథే ‘రేస్‌–3’ అని చెప్పొచ్చు. షంషేర్‌ సింగ్‌ అన్న కొడుకు సిఖిందర్‌ సింగ్‌ పాత్రలో నటించారు ‘సల్మాన్‌ఖాన్‌’. అనిల్‌ కపూర్‌ కవలపిల్లలుగా  నటి డైసీ షా (సంజన సింగ్‌) మరియు సాఖిబ్‌ సలీమ్‌ (సూర జ్‌ సింగ్‌) నటించారు. య‹శ్‌  అనే ఓ ముఖ్య పాత్రలో హీరో బాబీ డియోల్‌ నటించారు. ఈ సింగ్‌ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వీళ్లందరికీ ట్రబుల్‌ షూటర్‌ లాగా పనిచేసే పాత్రలో నటించారు ‘బాబీ డియోల్‌’. సినిమా మొత్తం ఏ ఫ్రేమ్‌లో చూసినా వీరే ఉంటారు.

సినిమా కథా కమామీషు...
అనిల్‌ కపూర్‌ మారణాయుధాలను అమ్మే వ్యాపారి. అతని అన్న కూడా ఇదే వ్యాపారంలో ఉంటాడు. ఓ లోకల్‌ లీడర్‌తో ఏర్పడిన వైరం అన్న ప్రాణాలు తీసేస్తుంది. అన్న భార్యను, కొడుకును తీసుకుని అనిల్‌ కపూర్‌ విదేశాలు పారిపోతాడు. వదినను తన భార్యగా చేసుకుంటాడు. ఈ ఇద్దరికీ కవలపిల్లలు  (కొడుకు, కూతురు సాఖిబ్‌ సలీమ్, డైసీషా) పుడతారు. బిడ్డలిద్దరూ తండ్రితో పాటు ఉంటూ వ్యాపార శత్రువులకు పోటీగా నిలుస్తారు.

ఓ రోజు అనిల్‌ కపూర్‌ని ఎటాక్‌ చేస్తారు యాంటీ గ్యాంగ్‌. ఆ గ్యాంగ్‌ అధినేత డ్రగ్‌ మాఫియాలో ఆరితేరిన ఫ్రీడీ దారువాలా (రానా). తండ్రిపై జరిగిన ఎటాక్‌కు కారణం ఎవరో తెలుసుకుని ఇమ్మీడియట్‌గా ఫ్రీడి మీదకి వెళతారు డైసీ, సాఖిబ్‌. అలా వెళ్లిన తన తమ్ముడు, చెల్లెలు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకున్న సల్మాన్‌ ఖాన్‌ వారిద్దరినీ  విడిపించటానికి అక్కడికి వెళతాడు. అది సల్మాన్‌ ఇంట్రడక్షన్‌. అలా వీరు ముగ్గురు విలన్‌ గ్యాంగ్‌తో ఫైట్‌ చేస్తుంటే వీరికి తోడుగా ట్రబుల్‌ షూటర్‌ బాబీ డియోల్‌ జాయిన్‌ అవుతాడు. అందరూ అక్కడి నుండి సేఫ్‌గా బయటపడతారు.

అనిల్‌ కపూర్‌ పిల్లలందర్నీ రమ్మని చెప్పి తన ఫ్యామిలీ లాయర్‌ ద్వారా ఆస్తి పంపకాలు చేస్తాడు. ఆస్తిలో 50 శాతం వాటాను తన పిల్లలైన డైసీషా, సాఖిబ్‌లకు మిగతా 50 శాతం వాటాను సల్మాన్‌ ఖాన్‌కు రాస్తున్నట్టు ప్రకటిస్తాడు అనిల్‌కపూర్‌. అది విని స్వతహాగా కోపంగా ఉండే తన పిల్లలు ఆవేశపడిపోతారు. అక్కడి నుండి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్‌ ప్రారంభమవుతాయి. కానీ అవేమి పెద్ద ప్రాబ్లమ్స్‌ కావు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ అందరూ ఫ్రెండ్లీగా బిహేవ్‌ చేస్తుంటారు.

ఈ టైమ్‌లో అందరూ పార్టీ చేసుకుంటుంటే పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్‌ అందరూ తమ లవర్స్‌తో వచ్చి ఎంజాయ్‌ చేస్తుంటారు, కానీ ఆ నలుగురు మాత్రం ఒంటరిగా ఉంటారు. వచ్చినవారందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు మనం మాత్రం ఇలా ఉన్నాం అని డైసీషా అంటే మీకెవ్వరికీ ఏమీ లేదేమో కానీ నాకు మాత్రం లవర్‌ ఉంది అని బాబీ డియోల్‌ తన లవర్‌ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌’ గురించి చెప్తాడు. అందరూ వారి వారి కబుర్లు చెప్పుకుంటారు. ఇదిలా వుంటే అనిల్‌ కపూర్‌ చిన్ననాటి స్నేహితుడు భారత్‌ దేశం నుండి ఫోన్‌ చేసి, అర్జంట్‌గా కలవాలని ఓ మంచి డీల్‌తో వచ్చానని చెప్తాడు. సరే అని అతన్ని కలిసి విషయం తెలుసుకున్న అనిల్‌ కపూర్‌ ఫ్యామిలీ అందర్నీ పిలిచి తను ఒప్పుకున్న డీల్‌ గురించి చెప్తాడు అనిల్‌ కపూర్‌.

ఆ డీల్‌ సారాంశం ఏంటంటే.. భారత్‌లో ఓ 7 స్టార్‌ హోటల్‌ ఉంది. ఆ హోటల్‌లో 8 మంది మంత్రులు అమ్మాయిలతో ఉండటాన్ని రహస్య కెమెరాల ద్వారా చిత్రించి, వాటిని ఆ మంత్రులకే పంపి బిజినెస్‌ ప్రపోజల్‌ పెడతారు. ఆ వీడియోలన్నీ ఉన్న హార్డ్‌డిస్క్‌ వేరే కంట్రీలో ఓ లాకర్లో ఉన్న సమాచారం నా దగ్గర ఉంది. ఆ హార్డ్‌ డిస్క్‌ నా కిస్తే మీకు బిలియన్‌ డాలర్ల మనీ ఇస్తాను, అది డీల్‌ అని చెప్తాడు అనిల్‌ కపూర్‌ ఫ్రెండ్‌. అక్కడి నుండి హార్డ్‌ డిస్క్‌ను ఎలా తీసుకొచ్చారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కథ ప్రీ–క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇక్కడనుండి కథలో ఉన్న చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా రివీల్‌ అవుతుంటాయి.

బాబీ డియోల్‌ తన గర్ల్‌ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెస్‌ అసలు అతని ప్రేయసియేనా? సల్మాన్‌ లవరా? అనే డౌట్‌ ప్రేక్షకులకు ఉంటుంది. ఎప్పుడూ తన తమ్ముడు, చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడుకుంటాననే సల్మాన్‌ ఆస్తి వివాదాల వల్ల చివరి దాకా అలానే ఉన్నాడా? వీరి జీవితాల్లోకి జాక్వెలిన్‌ సడన్‌ ఎంట్రీకి కారణం ఏంటి? బాబీ డియోల్‌ క్యారెక్టర్‌ వెనక ఉన్న అసలు ట్విస్ట్‌ ఏంటి? ఎనిమిది మంత్రుల వీడియోలు ఏమయ్యాయి? అన్నది క్లైమాక్స్‌లో చూడాల్సిందే.

హైలైట్స్‌
– తారాగణం, గత చిత్రాలతో పోల్చితే సల్మాన్‌ సూపర్‌ స్టార్‌ కింద లెక్క.
– వండర్‌ఫుల్‌ విజువల్స్‌.
– బ్యాగ్రౌండ్‌ స్కోర్‌.
– పంచ్‌ డైలాగ్స్‌.
–  అద్భుతమైన లొకేషన్స్‌.
– ఆసక్తికరమైన మలుపులు.

మైనస్‌
– కథ, కథనాల్లో ఎక్కడా స్పీడ్‌ లేదు.
– స్లో నారేషన్‌.
– స్టోరీలో డ్రామా లోపించడం.
– పాత్రధారులంతా పాత్రల్లో లీనమైనట్లుగా కనిపించదు.
– సాంగ్స్‌ చెప్పుకోదగ్గ విధంగా లేవు.

                                                   - శివ మల్లాల

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా