కృష్ణజింకకు బిస్కెట్లు తినిపించా: సల్మాన్‌ ఖాన్‌

5 Apr, 2018 13:47 IST|Sakshi
సల్మాన్‌ ఖాన్‌

సాక్షి, ముంబై : రాజస్తాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసు సుదీర్ఘకాలం నుంచి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ను వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో తన సహ నటులు సైఫ్‌ అలీఖాన్‌, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌ను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు.. సల్మాన్‌ను మాత్రం దోషిగా తేల్చింది. హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్‌ సందర్భంగా రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో రెండు కృష్ణజింకలను సల్మాన్‌ ఖాన్‌ వేటాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆయన చింకారాలను (దుప్పిలను) కూడా వేటాడినట్టు, సెప్టెంబర్‌ 28, 1998 నాడు ఘోడా ఫార్మ్స్‌లో ఓ కృష్ణజింకను వెటాడినట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు.

1998 అక్టోబర్‌ 2న బిష్ణోయ్‌ ప్రజలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న కృష్ణజింకలను వెటాడటం నేరం. ఇందుకు గరిష్టంగా ఆరేళ్ల జైలుశిక్ష పడే అవకాశుమంది. ఈ కేసులో 1998 అక్టోబర్‌లో అరెస్టైన సల్మాన్‌ ఆ తర్వాత ఐదు రోజులకు బెయిల్‌పై విడుదల అయ్యారు. జింకలను వెటాడిన ఒక కేసులో సల్మాన్‌కు ఇప్పటికే కిందికోర్టు శిక్ష విధించింది. అయితే, అదృష్టం ఆయన పక్షాన ఉండటంతో రాజస్థాన్‌ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. కృష్ణజింకలను వేటాడిన మరో కేసులోనూ సల్మాన్‌ తాజాగా దోషిగా తేలడంతో ఆయనకు ఎంతకాలం శిక్షపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ కేసు నేపథ్యంలో 2009లో ఎన్డీటీవీతో మాట్లాడుతూ సల్మాన్‌ ఖాన్‌ చెప్పిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కేసులో తమ పక్షం వాదనను ఆయన మీడియాతో పంచుకున్నారు. హమ్‌ సాత్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్‌ ముగించుకొని ఆ రోజు తాను, తన సహనటులు త్వరగా బయలుదేరామని, తాము వెళ్తుండగా కృష్ణజింకల గుంపు ఎదురుపడిందని, అందులోని ఒక దానికి తాము బిస్కెట్లు తినిపించామని ఆయన చెప్పారు. ‘ఒక జింక పొదలో ఇరుక్కోవడం మేం చూశాం. పెద్ద జింకల గుంపు అక్కడ ఉంది. పొదలో చిన్న జింక చిక్కుకుంది. అది కదల్లేక తీవ్రంగా భయపడుతోంది. నేను అక్కడి నుంచి దానిని బయటకు తీశాను. మేం దానికి కొంచెం నీళ్లు తాగించాం. జింక కొన్ని బిస్కెట్లను తిన్న తర్వాత అడవిలోకి పారిపోయింది’ అని సల్మాన్‌ వివరించారు. ఈ ఘటననే చిలువలు, పలువులు చేసి వివాదాన్ని ఇంతదాక తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు