భారత్‌ సినిమా అంచనాలపై స్పందించిన సల్మాన్‌

3 Jun, 2019 16:13 IST|Sakshi

ఓ దశాబ్ద కాలంగా సల్మాన్‌ ఖాన్‌ బాక్సాఫీస్‌ సుల్తాన్‌గా రాణిస్తున్నారు. సల్మాన్‌ సినిమా అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. అంచనాలు కూడా ఓ రేంజ్‌లో ఉంటాయి. సాధరణంగా ఓ సినిమా రూ. 100 కోట్లు రాబట్టిందంటే సూపర్‌ హిట్‌ అంటారు. అదే సల్మాన్‌ చిత్రం రూ. 150 కోట్లు రాబట్టినా.. దాన్ని హిట్‌గా భావించరు అభిమానులు. ఈ క్రమంలో సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన ‘భారత్‌’ చిత్రం ఈ నెల 5 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘భారత్’ రూ.300 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు. ‘ఇలా ముందుగానే భారీగా అంచనాలు పెరగడం పట్ల ఒత్తిడిగా ఫీల్‌ అవుతున్నారా’ అని మీడియా సల్మాన్‌ని ప్రశ్నించింది.

అందుకు ఆయన స్పందిస్తూ.. ‘రూ.300 కోట్లు రావాలని మీరు ఆశిస్తే, అంచనా వేస్తే.. థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి. ఇంట్లో కూర్చుని చూడొద్దు. నెట్‌లో చూద్దాం, పైరసీ కాపీ చూద్దాం.. కొన్ని రోజుల ఆగితే టీవీలో వస్తుంది కదా.. చూద్దాం అని అనుకోకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి. అప్పుడు మీరు ఆశించిన స్థాయి వసూళ్లు వస్తాయి. రూ.300 కోట్లు ఏంటి, రూ.600 కోట్లు కూడా వస్తాయి’ అన్నారు సల్మాన్‌. కత్రినా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు