దక్షిణాది చిత్రాలంటే నాకిష్టం! 

26 Oct, 2019 09:08 IST|Sakshi

దక్షిణాది చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అని బాలీవుడ్‌ కండల హీరో సల్మాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. ఈయన తాజాగా నటించిన చిత్రం దబాంగ్‌–3. దీనికి ఈయనే నిర్మాత కావడం విశేషం. మరో విశేషం ప్రభుదేవా దర్శకుడు కావడం. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన దబాంగ్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత దబాంగ్‌–2 చేశారు. తాజా గా దానికి మూడవ సీక్వెల్‌గా దబాంగ్‌ 3 రెడీ అయ్యింది. సోనాక్షిసిన్హా నాయకిగా నటించిన ఇందులో నటుడు ప్రకాశ్‌రాజ్, అర్బాస్‌ఖాన్, మహీగిల్‌ ముఖ్యపాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న దబాంగ్‌–3 చిత్ర ప్రమోషన్‌లో చిత్ర యూనిట్‌ బిజీగా ఉన్నారు. ఇది హిందీతో పాటు పలు భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. చిత్ర టీజర్‌ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో చిత్ర తమిళ వెర్షన్‌ ప్రసారంలో భాగంగా నటుడు సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా బుధవారం చెన్నైలో హల్‌చల్‌ చేశారు. దబాంగ్‌–3 చిత్ర దర్శకుడు ప్రభుదేవా మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. దబాంగ్‌ చిత్రం సక్సెస్‌ తరువాత ఇప్పుడు దబాంగ్‌–3 చిత్రం చేసినట్లు తెలిపారు. ఈ చిత్రంపై చాలా అంచనాలు నెలకొన్నాయని అన్నారు. దీంతో చిత్ర యూనిట్‌ అంతా చాలా శ్రమించినట్లు తెలిపారు. 

దబాంగ్‌–3ని దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. అందువల్ల ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రేక్షకులను నేరుగా కలుసుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర ట్రైలర్‌ అందరినీ అలరించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు సల్మాన్‌ఖాన్‌ మాట్లాడుతూ దక్షిణాది చిత్రాలు తనకెప్పుడూ ఇష్టమేనన్నారు. రజనీకాంత్, కమలహాసన్, అజిత్, విజయ్, విక్రమ్‌ నటించిన చిత్రాలను తాను చాలా ఇష్టపడిచూస్తానని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతం హిందీ చిత్రాలకంటే కూడా బాహుబలి, కేజీఎఫ్‌ వంటి దక్షిణాది చిత్రాలే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయని అన్నారు. తమిళంలో విజయ్‌ నటించిన పోకిరి చిత్ర హీంది రీమేక్‌లో తాను నటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నటించిన తెరి, తిరుపాచ్చి చిత్రాలు తనకు బాగా నచ్చినట్లు చెప్పారు. దబాంగ్‌–3 చిత్రం తన మనసుకు బాగా దగ్గరైన చిత్రం అని అన్నారు. ఇది దక్షిణాది చిత్రాల మాదిరిగానే ఉంటుందని,  ఇందులో దక్షిణాదికి చెందిన వారు ఎక్కువగా పనిచేసినట్లు తెలిపారు. ప్రభుదేవా మా సొత్తు అని పేర్కొన్నారు. ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విజయానికి చిహ్నంగా పేర్కొన్నారు. తన తదుపరి చిత్రానికి ఆయనే దర్శకుడని చెప్పారు. మరోసారి త్వరలోనే తమిళ ప్రేక్షకులను తాను ప్రత్యక్షంగా కలుసుకుంటానని నటుడు సల్మాన్‌ఖాన్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు