సమంత.. ఇక శాకాహారిగా!

26 Jan, 2019 07:08 IST|Sakshi

తమిళసినిమా: ప్రముఖ నటిగా రాణిస్తున్న వారిలో నటి సమంత ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ నట జీవితం పెళ్లికి ముందు ఆ తరువాత అని విభజించి చూడవచ్చు. పెళ్లికి ముందు సమంత ఇమేజ్‌ వేరు ఇప్పుడు వేరు. నటిగా తనను తాను చాలా మెరుగుపరుచుకుంది. అందుకు నిదర్శనం రంగస్థలం, మహానటి, యూటర్న్‌ వంటి చిత్రాల్లో పరిపక్వతతో కూడిన ఆమె నటనే. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రల్లోనే నటించాలని తను తీసుకున్న నిర్ణయమే అందుకు కారణం కావచ్చు.

నటి సమంత ప్రతి ఏడాది ప్రారంభంలో జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని వాటిని పాటిస్తోందట. ఈ విషయాన్ని చిన్న వయసులోనే తన తల్లి చెప్పిందని, అమ్మ మాటను అమలుపరుస్తున్నట్లు ఒక భేటీలో పేర్కొంది. ఈ ఏడాది కూడా కొన్ని మంచి విషయాలను పాటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అందులో ఉన్నత ఆలోచనలు ముఖ్యమని వాటిని పెంచుకుంటున్నట్లు తెలిపింది. ఇక సహ వ్యక్తులపై మరింత ప్రేమను చూపాలని నిర్ణయించుకున్నానంది.  అదేవిధంగా ఇకపై మాంసాహారాన్ని త్యజించి, శాకాహారాన్నే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానంది. ఇవన్నీ పాఠిస్తూ ప్రశాంత జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు సమంత పేర్కొంది. ఇక ఈ బ్యూటీ విజయ్‌సేతుపతితో జతకట్టిన సూపర్‌డీలక్స్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమ్మర్‌ స్పెషల్‌గా మార్చిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తెలుగులో తన భర్త నాగచైతన్యతో ఒక చిత్రం చేస్తోంది. 

మరిన్ని వార్తలు