హ్యాపీ గార్డెనింగ్‌

14 Jun, 2020 03:51 IST|Sakshi

‘‘నా తొలి పంట నా చేతికి వచ్చింది’’ అని సంబరపడిపోతున్నారు సమంత. ఇటీవల ఆమె టెర్రస్‌ గార్డెనింగ్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ‘క్యాబేజ్‌ మైక్రోగ్రీన్స్‌’ని పండించారు. మైక్రోగ్రీన్స్‌ అంటే సూక్ష్మ మొక్కలు అని అర్థం. రెగ్యులర్‌ క్యాబేజ్‌కన్నా ఈ మైక్రోగ్రీన్స్‌లో పోషకాలు ఎక్కువ.  ఇక ట్రేల్లో పండించిన క్యాబేజీ ఫొటోను షేర్‌ చేసి, ‘ఒకవేళ మీకు గార్డెనింగ్‌ మీద ఆసక్తి ఉంటే.. క్యాబేజీ మైక్రోగ్రీన్స్‌ని ఎలా పండించాలో’ నేను చెబుతా అన్నారు సమంత. చక్కగా స్టెప్‌ బై స్టెప్‌ చెప్పారామె.

‘‘ఈ పంటకు మీకు కావాల్సిందల్లా ఒక ట్రే, కోకోపీట్‌ (కొబ్బరి పొట్ట ఎరువు), విత్తనాలు, చల్లని గది.. అంతే. నా బెడ్‌రూమ్‌ కిటికీ సూర్యరశ్మి పాక్షికంగా వస్తుంది. ఒకవేళ ట్రైకి తగినంత సూర్య రశ్మి రాకపోతే దానికి దగ్గరగా ఒక బెడ్‌ ల్యాంప్‌ ఉంచవచ్చు. ఇక పంట ఎలా వేయాలంటే..

1. ట్రేని కోకోపీట్‌తో నింపాలి.

2.విత్తనాలు చల్లండి

3.కోకోపీట్‌ మొత్తం తడిచేవరకూ నీళ్లు చల్లి, ఆ తర్వాత ట్రేని కవర్‌ చేయండి. కిటికీకి దగ్గరగా ఇంట్లో చల్లని ప్రాంతంలో ఈ ట్రేని ఉంచండి. సూర్యరశ్మి తక్కువగా ఉందనిపిస్తే.. బెడ్‌సైడ్‌ ల్యాంప్‌ ట్రే దగ్గర ఉంచండి. నేను అలానే చేశాను. నాలుగు రోజులు ట్రే కదిలించకుండా అలానే ఉండనివ్వండి. ప్రతి రోజూ మీరు గమనిస్తే మొలకలు కనబడతాయి. ఐదో రోజు ట్రే మీద ఉన్న కవర్‌ తీసి, రోజుకోసారి నీళ్లు చల్లండి. ఎనిమిదో రోజుకల్లా మీ మైక్రోగ్రీన్స్‌ రెడీ అయిపోతాయి’’ అని మొత్తం వివరించి, ‘హ్యాపీ గార్డెనింగ్‌’ అన్నారు సమంత.

మరిన్ని వార్తలు