‘ఓ బేబీ’ మూవీ రివ్యూ

5 Jul, 2019 12:18 IST|Sakshi

టైటిల్ : ఓ బేబీ
జానర్ : ఫాంటసీ కామెడీ డ్రామా
తారాగణం : సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌, తేజ
సంగీతం : మిక్కీ జే మేయర్‌
దర్శకత్వం : నందినీ రెడ్డి
నిర్మాత : సురేష్ బాబు, సునితా తాటి, టీజీ విశ్వప్రసాద్‌, హ్యూన్వూ థామస్ కిమ్

పెళ్లి తరువాత విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న సమంత, తాజాగా చేసిన మరో ప్రయోగం ఓ బేబీ. వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌ చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు నందిని రెడ్డి. కొరియన్‌ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? బేబీ పాత్రలో సమంత మెప్పించారా?

కథ :
సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ) 70 ఏళ్ల వృద్ధురాలు. కొడుకు (రావూ రమేష్)తో కలిసి ఉండే సావిత్రి తన అతి ప్రేమ,  చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. దీంతో మనస్తాపం చెందిన సావిత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అంతేకాదు తన యవ్వనం తిరిగి వస్తే బాగుండు అని కోరుకుంటుంది. వెంటనే దేవుడు ఆమెకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అలా తిరిగి పడుచు పిల్లగా మారిన బేబీకి (సమంత)కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆమె ప్రయాణం ఎలా సాగింది? చివరకు బేబీ తన అసలు వయస్సుకు వచ్చిందా.. లేదా..?అన్నదే మిగతా కథ.



నటీనటులు :

ఇది పూర్తిగా సమంత సినిమా. తన బాడీ లాంగ్వేజ్‌కు, ఎనర్జీకి తగ్గ పాత్రలో సమంత జీవించారనే చెప్పాలి. బేబి పాత్రలో మరో నటిని ఊహించుకోలేనంతగా సమంత మెప్పించారు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ సమంత అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమా బాధ్యత అంతా తన భుజాల మీదే మోసిన సమంత వందశాతం సక్సెస్‌ అయ్యారు. కీలక పాత్రలో సీనియర్‌ నటి లక్ష్మీ కూడా జీవించారు. సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌లు తమకు అలవాటైన పాత్రల్లో అలవోకగా నటించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, సమంత కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక క్లైమాక్స్‌లో సమంత, రావు రమేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి. నాగశౌర్యకు పెద్దగా నటనకు అవకాశం లేకపోయినా ఉన్నంతలో తనవంతుగా మెప్పించాడు. బాలనటుడుగా సుపరిచితుడైన తేజ ఈ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అతిథి పాత్రల్లో జగపతి బాబు, అడవి శేష్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ :
అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన నందిని రెడ్డి తరువాత సక్సెస్‌ వేటలో వెనుకపడ్డారు. దీంతో లాంగ్‌ గ్యాప్‌ తరువాత సమంత ప్రధాన పాత్రలో కొరియన్‌ సినిమా మిస్‌ గ్రానీని తెలుగులో రీమేక్‌ చేశారు. రెగ్యులర్ లేడీ ఓరియంటెడ్‌ సినిమాల తరహాలో కాకుండా ఓ ఫన్‌ రైడ్‌లా సినిమాను తెరకెక్కించిన నందిని సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సూపర్బ్‌గా వర్క్‌ అవుట్‌ అయ్యింది. తొలి భాగాన్ని ఎంటర్‌టైనింగ్‌గా నడిపించిన దర్శకురాలు ద్వితీయార్థం ఎక్కువగా ఎమోషనల్‌ సీన్స్‌తో నడిపించారు. ఎంటర్‌టైన్మెంట్‌ కాస్త తగ్గటం, కథనం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు సాగడంతో సెకండ్‌ హాఫ్ కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది.  అయితే మధ్య మధ్యలో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి.

సినిమాకు మరో ప్రధాన బలం లక్ష్మీ భూపాల్ అందించిన సంభాషణలు. డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తూనే, ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ తన మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడనే చెప్పాలి. గుర్తుండిపోయే స్థాయిలో ఒక్కపాట కూడా లేకపోవటం నిరాశపరిచే అంశమే. నేపథ్య సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం. ప్రతీ ఫ్రేమ్‌ను కలర్‌ఫుల్‌గా చూపించటంలో సినిమాటోగ్రాఫర్‌ విజయం సాధించారు. ఎడిటింగ్ పరవాలేదు. ద్వితీయార్థంలో కొన్ని సీన్స్‌కు కత్తెర పడితే బాగుండనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
సమంత పర్ఫామెన్స్‌
ఫస్ట్‌ హాఫ్‌ కామెడీ
ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
సెకండ్‌ హాప్‌ లెంగ్త్‌
సంగీతం

సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

Poll
Loading...
మరిన్ని వార్తలు