లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ అంటే చిరాకు

28 Dec, 2019 01:03 IST|Sakshi
శంకర్‌ ప్రసాద్, ఉషా ముల్పూరి, నాగశౌర్య, రమణ తేజ

– నాగశౌర్య

‘‘ఛలో’ సినిమా టీజర్‌ ఇక్కడే(రామానాయుడు  ప్రివ్యూ థియేటర్‌) విడుదల చేశాం.. బ్లాక్‌ బస్టర్‌ అయింది. ‘నర్తనశాల’ టీజర్‌ కూడా ఇదే ప్లేస్‌లో రిలీజ్‌ చేశాం.. ఫ్లాప్‌ అయింది. ఇప్పుడు ‘అశ్వథ్థామ’ టీజర్‌ని కూడా ఇక్కడే రిలీజ్‌ చేస్తున్నాం.. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని గర్వంగా చెప్పగలను. నా తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునేలా ఈ సినిమా చేశాను’’ అని నాగశౌర్య అన్నారు. రమణ తేజని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నాగశౌర్య, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్‌ని హీరోయిన్‌ సమంత ట్విట్టర్‌లో విడుదల చేశారు.

అలాగే రామానాయుడు స్టూడియోలో జరిగిన టీజర్‌ విడుదల కార్యక్రమంలో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఢిల్లీ, ముంబైలలో అమ్మాయిలపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ‘అశ్వథ్థామ’ కథను రాశా. ‘ఛలో’ కథ నేనే రాసినా పేరు వేసుకోలేదు. నాకు కథలు రాయడం, చెప్పడం ఇష్టం. నాకు లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ అంటే చాలా చిరాకు.. అందుకే ఈ చిత్రంలో దాని నుంచి పూర్తీగా బయటికి వచ్చి రఫ్‌గా ఉండే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘నాగశౌర్య మంచి కథ రాశారు. ఈ చిత్రంలో నాగశౌర్య విశ్వరూపం చూస్తారు’’ అన్నారు రమణ తేజ. ‘‘కథని నమ్మి ఈ సినిమా తీశాం’’ అన్నారు శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి. ‘‘ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి స్పందన వస్తోంది. మా సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో లైన్‌ ప్రొడ్యూసర్‌ బుజ్జి, సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల, ఎడిటర్‌ గ్యారీ, కెమెరామెన్‌ మనోజ్‌ రెడ్డి, డైరెక్టర్‌ బి.వి.యస్‌.రవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా