నిర్మాతగా సమంత?

6 Apr, 2016 17:36 IST|Sakshi
నిర్మాతగా సమంత?

కథానాయికలు నిర్మాతలవడం అన్నది కొత్తేమీకాదు. అయితే ఆ రంగంలో రాణించిన హీరోయిన్లు మాత్రం తక్కువే. చేతులు కాల్చుకున్న వారే ఎక్కువ. ఇటీవల నటి సిమ్రాన్ నిర్మాతగా చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజాగా చెన్నై చిన్నది సమంత చిత్ర నిర్మాణ రంగంలోకి దిగడానికి ఉవ్వుళ్లూరుతున్నట్టు సమాచారం. ఈ బ్యూటీ హీరోయిన్‌గా బిజీగానే ఉన్నారు.
 
 తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోలతోనే జత కడుతున్నారు. తమిళంలో విజయ్ సరసన నటించిన తెరి చిత్రం విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కారణం ఆమెకిక్కడ అర్జెంట్‌గా ఒక హిట్ అవసరం. నాన్‌ఈ, కత్తి చిత్రాలు మినహా సమంతకు కోలీవుడ్‌లో సక్సెస్ చిత్రాలు లేవు. తను ఎంతగానో ఆశలు పెట్టుకున్న 10 ఎండ్రదుక్కుళ్ చిత్రం నిరాశపరచింది. ఇక తెలుగులో నితిన్‌కు జంటగా నటించిన అ.ఆ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
 
  ఆ మధ్య సమంత చిత్ర పంపిణీ రంగంలోకి అడుగు పెట్టనున్నారనే ప్రచారం మీడియాలో హల్ చల్ చేసింది. అయితే దాన్ని సమంత ఖండించారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా నిర్మాత అవతారమెత్తనున్నారనే ప్రచారం జరుగుతోంది.కన్నడంలో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పవన్‌కుమార్ తాజా చిత్రం యూటర్న్.
 
  ఆ చిత్ర తమిళ రీమేక్ హక్కుల్ని నటి సమంత సొంతం చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ చిత్రంలో నాయకిగా సమంతే నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి నిర్మాతగా ఈ ముద్దుగుమ్మ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.అయితే దీని గురించి సమంత వర్గం ఇప్పటి వరకూ నోరు మెదపలేదన్నది గమనార్హం.