అనువాద చిత్రాల జోరు

24 Mar, 2014 01:16 IST|Sakshi
అనువాద చిత్రాల జోరు

అనువాదం... తమిళ నిర్మాతలకిది కాసుల పంట పండిస్తోంది. ఒక భాష నుంచి పరభాషలోకి చిత్రాలను అనువదించడం అనేది అనాదిగా జరుగుతోంది. ఎన్‌టీఆర్, ఎంజీఆర్, ఏఎన్‌ఆర్, శివాజీ గణేశన్‌ల కాలం ముందు నుంచి అనువాద చిత్రాల ఒరవడి సాగుతోంది. అయితే అప్పట్లో అనువాదమనేది అంత ముమ్మరంగా లేదు. స్టార్ నాయకీనాయకుల చిత్రాలనే ఇతర భాషల్లోకి అనువదించేవారు. ఇక దక్షిణాది చిత్ర పరిశ్రమను తీసుకుంటే ఇంతకుముందు తెలుగు చిత్రాలు తమిళంలోకి అధికంగా అనువాదం అయ్యేవి. 20వ శతాబ్దంలో తెలుగు చిత్రాలు తమిళ అనువాదం అనేది అధికంగా జరిగింది.

 
  తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఆ తరువాత తరం మహేష్‌బాబు, రవితేజ, జూనియర్ ఎన్‌టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ చిత్రాలకు తమిళంలో మంచి ఆదరణ ఉండేది. ముఖ్యంగా మహేష్‌బాబు చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా మహేష్‌బాబు తెలుగులో నటించిన చిత్రాలను తమిళ రీమేక్‌లో నటించడానికి విజయ్ అధిక ఆసక్తి చూపిస్తారు. ఒక్కడు, పోకిరి వంటి చిత్రాలు తమిళ రీమేక్‌లో విజయ్ మంచి విజయాన్ని కైవసం చేసుకున్నారు.
 
 
 చిన్న చిత్రాల జోరు :
 పెద్ద నటుల చిత్రాలకే కాదు, ఇటీవల చిన్న చిత్రాల తెలుగు అనువాదాల జోరు బాగా పెరిగింది. అందుకు కారణం ప్రేమిస్తే, జర్నీ వంటి చిత్రాలు విజయాల బాట పట్టడమే. ప్రస్తుతం తెలుగులో విడుదలకు సిద్ధం అవుతున్న తమిళ అనువాదాల పట్టిక పొడవు చాలానే ఉంది. ఆర్య, నయనతార నటించిన రాజారాణి, అజిత్ తమన్న నటించిన వీరుడొక్కడే నవ తారలు నటించిన భద్రమ్ తదితర చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి.
 
  జీవా, త్రిష నటించిన ఎండ్రెండ్రుం పున్నగై తెలుగులో చిరునవ్వుల చిరు జల్లు పేరుతోను, విక్రమ్ ప్రభు నటించిన ఇవన్ వేరే మాదిరి చిత్రం సిటిజన్ పేరుతోను త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. వీటితో పాటు పలు చిత్రాలు అనువాద దశలో ఉన్నాయి. ఇలా తెలుగు అనువాదంతో తమిళ నిర్మాతలకు కాసులు కురుస్తున్నాయి. కోలీవుడ్‌లో చిత్రాలను విడుదల చేయడం అనేది ప్రస్తుతం కష్టసాధ్యం అవుతుంది. ముఖ్యంగా చిన్న చిత్రాలను కొనడానికి బయ్యర్లు థియేటర్ల యజమాన్యం ముందుకు రావడం లేదు. ఇన్ని అవాంతరాలను చూసుకున్న తరువాత విడుదలైన థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి చిత్రాలను తెలుగు, ఇతర భాషల్లో అనువదించడం తప్పనిసరి అవుతోందని ప్రముఖ నిర్మాత ఒకరు పేర్కొన్నారు.
 
 
 సీన్ రివర్స్
 గతంలో తెలుగు నుంచి తమిళంలోని అనువాదమైతే, ఇప్పుడు తమిళ అనువాద చిత్రాలకు టాలీవుడ్ లో మంచి ఆదరణే ఉంది. అయితే ఒకప్పుడు రజనీకాంత్, కమలహాసన్ వంటి స్టార్ నటుల చిత్రాలకే టాలీవుడ్‌లో ఆదరణ ఉండేది. ఆ తరువాత దర్శకుడు కె.బాలచందర్, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలను అనువదించడానికి నిర్మాతలు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం తమిళ అనువాద చిత్రాల తీవ్రత పెరిగింది. దాదాపు తమిళంలో విడుదలైన ప్రతి చిత్రం తెలుగులో అనువాదం అవుతుందనడం అతిశయోక్తి కాదు. మరో విషయం ఏమిటంటే వీటిలో కొన్ని చిత్రాలు తెలుగులో పునర్ నిర్మాణం అయితే అవే చిత్రాలను మళ్లీ అనువదంచి కాసులు సంపాదించుకుంటున్నారు. ఈ తరహా చిత్రాలకు అధికంగా వ్యాపారం జరుగుతుండటం విశేషం.
 
 కొన్ని చిత్రాల క్రేజ్ వేరు :
 
 కొందరు నక్షత్ర నటుల చిత్రాలకు టాలీవుడ్‌లో యమక్రేజ్‌గా వ్యాపారం జరుగుతోంది. సూపర్‌స్టార్ రజనీ కాంత్ ఎందిరన్ చిత్ర అనువాద హక్కులు కోట్ల రూపాయల్లో అమ్ముడు పోయాయి. తాజా చిత్రం కోచ్చడయాన్‌పై కోలీవుడ్‌లో సమానంగా టాలీవుడ్‌లో క్రేజ్ నెలకొంది. అక్కడి ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. పద్మశ్రీ కమలహాసన్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించిన ప్రతి చిత్రం తెలుగులో విడుదలవుతుంది.
 
 సూర్య బ్రదర్స్ హవా :
 తాజాగా నట సోదరులు సూర్య, కార్తీ చిత్రాలకు తెలుగులో యమ వ్యాపారం జరుగుతుంది. విశాల్, అజిత్ చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంది.
 
 కోలీవుడ్‌పై నిలా నిందలు
 నటి నిలా (మీరా చోప్రా) కోలీవుడ్‌పై నిందల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు ఇకపై తమిళ చిత్రాల్లో నటించేది లేదని ఖరాఖండిగా చెప్పింది. తమిళంలో ఎస్‌జె సూర్య దర్శకత్వం వహించిన హీరోగా నటించిన అన్భే ఆరుయిరే చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ ఉత్తరాది భామ ఆ తరువాత జాంబవన్, మరుదమలై, కాళై, కిల్లాడి తదితర చిత్రాల్లో నటించింది. కొన్నేళ్లుగా తమిళ తెరకు దూరం అయిన ఈ జాణ హిందీ చిత్రాలపై దృష్టి సారిస్తోంది. కోలీవుడ్‌లో కనిపించడం లేదే అన్న ప్రశ్నకు నిలా బదులిస్తూ తమిళంలో తాను నటించిన పలు చిత్రాలు విజయం సాధించాయని అంది. అయితే తాను నటించిన ప్రతి చిత్రం విడుదలవుతున్నప్పుడు ఇదే తన చివరి తమిళ చిత్రం అనే భావం కలిగేదని అంది. అదే విధంగా భావం తెలియని భాషలో చిక్కుకున్నానని అనిపించేదని పేర్కొంది.
 
 కోలీవుడ్‌లో అధికంగా తమిళం, తెలుగు భాషల్లోనే మాట్లాడుకుంటారని చాలా మందికి ఆంగ్ల భాష తెలియదని వ్యంగ్యంగా పేర్కొంది. తమిళ సినీ రంగంలో ప్రముఖ నటీనటులనే గౌరవిస్తారని చిన్న తారలను పట్టించుకోరని ఆరోపించింది. అదే హిందీ చిత్ర రంగంలో అయితే ఎలాంటి తారతమ్యం చూపకుండా తమిళ కళాకారులను గౌరవిస్తారని చెప్పింది. అందుకే తాను హిందీ చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు ఇకపై తమిళంలో నటించనని అంది. ప్రస్తుతం హిందీలో గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్ టుడే చిత్రంలో నటిస్తున్నట్లు నిలా చెప్పింది.
 
 
 మార్పు కోరే ప్రముఖర్
 ప్రస్తుత రాజకీయ పరిస్థితిని మార్చడానికి పోరాడే నలుగురు యువకుల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం ప్రముఖర్ అని ఆ చిత్ర దర్శకుడు జె.పి.అళగర్ పేర్కొన్నారు. శ్రీలక్ష్మి షణ్ముగనాథన్ ఫిలింస్, వి.జె.ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రముఖర్. నూతన తారలు త్రిసూల్, మోహన్‌వేల్, జెస్సీ, కర్ణ నిర్మాతలలో ఒకరైన టిటి సురేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎస్.వి.గణేశన్ సంగీతాన్ని అందించారు. చిత్ర విశేషాలను దర్శకుడు తెలుపుతూ ఇది సాధారణ ప్రేమ కథా చిత్రం కాదన్నారు. నేటి రాజకీయ పరిస్థితిలో మార్పు కోసం పోరాడే నలుగురు యువకుల ఇతివృత్తం అని పేర్కొన్నారు. ప్రేమలో జయించాలని పోరాడే యువత, జీవితంలోనూ పోరాడాలని చెప్పే చిత్రం ఇదని చెప్పారు. నటుడు త్రిసూల్ ఇందులో రెండు గెటప్‌లలో నటిస్తున్నట్లు తెలిపారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలకు అధిక ప్రాముఖ్యత ఉంటుందన్నారు. చిత్ర నిర్మాణంలో ఆలస్యానికి కారణం కూడా ఇదేనని వివరించారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణం పూర్తి అయ్యిందని వచ్చే నెలలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.