నాన్‌వెజ్‌ మీల్స్‌ మాతోనే మొదలైంది

1 Jun, 2018 05:55 IST|Sakshi
శ్రీరామ రెడ్డి, కృష్ణ, శివలెంక, సుధీర్‌బాబు, ఇంద్రగంటి

కృష్ణ

మావయ్యా... మీరు యాక్ట్‌ చేసిన సినిమాల్లో మీకేది ఇష్టం?... అల్లుడు సుధీర్‌బాబు మామగారు కృష్ణ ముందుంచిన ప్రశ్న ఇది. ఇంతకీ అల్లుడు ఎందుకు జర్నలిస్ట్‌గా మారారు? అంటే.. ఆయన నటించిన ‘సమ్మోహనం’ చిత్రం ట్రైలర్‌ను కృష్ణ విడుదల చేశారు. గురువారం సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘సమ్మోహనం’ ట్రైలర్‌ను దర్శక– నిర్మాతలు మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్‌లు కృష్ణతో రిలీజ్‌ చేయించి, కొన్ని ప్రశ్నలడిగారు. ఆ చిన్న చిట్‌ చాట్‌ ఈ విధంగా....

ఇంద్రగంటి: ‘సమ్మోహనం’ అనగానే మీకు ఏవైనా జ్ఞాపకాలు గుర్తొచ్చాయా?
కృష్ణ: ‘సమ్మోహనం’ టైటిల్‌ ఇప్పటివరకూ ఎవరూ పెట్టలేదు. అచ్చ తెలుగు టైటిల్స్‌ బాగుంటాయి. మేం తీసిన సినిమాలన్నిటికీ తెలుగు టైటిల్స్‌ పెట్టామే కానీ, వేరే భాషవి పెట్టలేదు. ‘మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, ప్రజారాజ్యం, ఈనాడు... ఇలా అన్నీ తెలుగు మాటలతోనే పెట్టాం.
సుధీర్‌: మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన లవ్‌ స్టోరీ?
కృష్ణ: ‘పండంటి కాపురం’లో రొమాంటిక్‌ అంశాలు చాలా ఉంటాయి. ప్రజలకు బాగా నచ్చింది.  విడుదల చేసిన 37 సెంటర్లలోనూ వంద రోజులాడింది. 14 సెంటర్లలో 25 వారాలు ఆడింది.
సుధీర్‌: మహేశ్‌ పుట్టినరోజుని చిన్నప్పుడు ఎలా చేసేవారు?
కృష్ణ: మద్రాసులో చాలా బాగా చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్‌ అయిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడం మానేశాడు. అభిమానులు చేస్తున్నారు.
శివలెంక: మీ సంస్థ ఎంతోమందికి భోజనం పెట్టింది.. అప్పట్లో పద్మాలయాలో భోజనం చేయని వాళ్లు ఉండేవారు కాదు.
కృష్ణ: మేం ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసినప్పుడు మద్రాసులో లంచ్‌ అంటే సాంబార్‌ సాదమ్, తయిర్‌ సాదమ్‌ (పెరుగు అన్నం) అని పెట్టేవారు. కానీ, మా కంపెనీ పెట్టినప్పుడు ‘అగ్నిపరీక్ష’ నుంచే నాన్‌ వెజిటేరియన్‌తో ఫుల్లుగా భోజనం పెట్టడం అలవాటు చేశాం. ఆ తర్వాత మిగిలినవాళ్లు కూడా పెట్టారు.
సుధీర్‌: ఇటీవల ‘మహానటి’ వచ్చింది కదా.. మీ బయోపిక్‌ వస్తే హీరో ఎవరో తెలుసు. ఎవరు దర్శకత్వం చేస్తే బావుంటుంది?
కృష్ణ: పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూనే ఉంది. ఎప్పుడో తీయబోయే సినిమాకు ఇప్పుడే ఎలా చెప్పగలం..
 

మరిన్ని వార్తలు