నాది తెలంగాణైనా హోదాకు మద్దతు: సంపూర్ణేష్‌

26 Jan, 2017 15:04 IST|Sakshi
నాది తెలంగాణైనా హోదాకు మద్దతు: సంపూర్ణేష్‌

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ఉద్యమానికి హీరో సంపూర్ణేష్‌ బాబు మద్దతు ప్రకటించారు. ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని స్పష్టం చేశారు. తాను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడినే అయినప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతిస్తున్నానని, హోదా వల్ల ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు బాగుంటుందని, తెలుగువారంతా సంతోషంగా ఉంటారని అన్నారు.

ప్రత్యేక ప్యాకేజీ అంటే బిచ్చం అని.. హోదా అనేది స్థాయిని చూపించేది కావున ఆ స్టేటస్‌ కోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ పౌరులు, యువత తీవ్రంగా శ్రమిస్తున్నారని, శాంతియుత పోరాటం చేస్తున్నారని దానికి తన మద్దతు ఉందన్నారు. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించి ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తున్నారని, రిపబ్లిక్‌ డే రోజు కూడా బయటకు రానివ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క, తమ్మారెడ్డి భరద్వాజ కూడా హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆర్‌కే బీచ్‌లో హోదా ఉద్యమానికి మద్దతుగా శాంతియుత దీక్ష చేస్తున్న వారికి మద్దతిచ్చేందుకు తాము వస్తే పోలీసులు అడ్డుకున్నారని, అక్కడికి వెళ్లలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. పోలీసులు అడ్డుకోవడం అంటే కార్యక్రమం విజయవంతమైనట్లేనని తెలిపారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత ఆందోళనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమరోత్సాహంతో సన్నద్ధమైన విషయం తెలిసిందే.

తమిళనాడులో విజయవంతమైన జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లోనూ గణతంత్ర దినోత్సవం రోజు జిల్లా కేంద్రాల్లో శాంతియుత ఆందోళన చేపట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. పాలకుల కళ్లు తెరిపించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పేర్కొన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా తదితర పార్టీలు, బీసీ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. అలాగే, విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు.