సినిమాకు, వెబ్‌ సిరీస్‌కు ఒకేలా కష్టపడతాను : సనమ్‌ శెట్టి

13 May, 2019 09:03 IST|Sakshi

స్టార్‌డమ్‌ కోసం పోరా డుతున్న హీరోయిన్లలో నటి సనమ్‌శెట్టి ఒకరు. నటిగా బిజీగా ఉన్నా, సరిగ్గా పేలే పాత్ర కోసం ఎదురుచూస్తోంది. అంబులి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కథం కథం, సవారి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అదేవిధంగా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటిస్తున్న సనమ్‌శెట్టి తాజాగా మిష్కిన్‌ శిష్యుడు అర్జున్‌ కలైవన్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఇందులో బర్మా చిత్రం ఫేమ్‌ మైఖెల్‌ హీరోగా నటిస్తున్నారు. ఇది రివెంజ్, థ్రిల్లర్‌ సన్నివేశాలతో కూడిన ఒక అర్థవంతమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో ఒక మధ్య తరగతి కుటుం బానికి చెందిన యువకుడి ఎదుగుదలకు అండగా నలిచే యువతిగా నటి సనమ్‌శెట్టి నటిస్తోందట.

దీనితో పాటు ఈ బ్యూటీ తమిళం, ఆంగ్లం భాషల్లో నటించిన మార్కెట్‌ అనే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోందట. అంతే కాదు తాజాగా ఒక వెబ్‌ సిరీస్‌లోనూ నటించేస్తోందీ అమ్మడు. బహుభాషా నటిగా బిజీగా ఉన్నా, వెబ్‌ సీరీస్‌లో నటించడానికి సై అనడం గురించి అడగ్గా సనమ్‌శెట్టి ఏం చెప్పిందో చూద్దాం. ఇప్పుడు అంతా డిజిటల్‌ మయంగా మారింది. ఇక ఒక నటిగా సినిమాకు, వెబ్‌ సీరీస్‌కు పెద్దగా వ్యత్యాసం ఏం తెలియడం లేదు. రెండింటికీ శ్రమ ఒకటే. అయితే అవి విడుదలయ్యే విధానమే వేరు. ఇంకా చెప్పాలంటే తమిళంలో వెబ్‌ సిరీస్‌ నిర్మాణం తక్కువే. వాటి వీక్షకులు మాత్రం ఎక్కువవుతున్నారు. అందుకే వాటి నిర్మాణం అధికం కావలసి ఉంది అని నటి సనమ్‌శెట్టి పేర్కొంది.
 

మరిన్ని వార్తలు