సండైకోళి-2 నాయకి ఈ బ్యూటీనేనా?

25 Oct, 2016 03:23 IST|Sakshi
సండైకోళి-2 నాయకి ఈ బ్యూటీనేనా?

సండైకోళి చాలా మందికి లైఫ్ ఇచ్చిన చిత్రం ఇది. పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం. దర్శకుడు లింగుసామి స్టామినా పెంచిన చిత్రం సండైకోళి. విశాల్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం ఇదే.  నటి మీరాజాస్మిన్‌కు క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం సండైకోళి. నటుడు రాజ్‌కిరణ్‌కు రీ-ఎంట్రీ ఇచ్చినచిత్రం. ఇలా చాలా మందికి నూతనోత్సాహాన్నిచ్చిన సండైకోళికి సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి.
విశాల్ హీరోగా నటిస్తూ తన సొంత బ్యానర్‌లో నిర్మించనున్న ఈ చిత్రానికి లింగుసామినే దర్శకత్వం వహించనున్నారు. అదే విధంగా రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రను పోషించనున్నారు.

ఇకపోతే హీరోయిన్ ఎవరన్నదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే సండైకోళి చిత్ర నాయకి మీరాజాస్మిన్‌కు ఇప్పుడు మార్కెట్ లేదు. అయితే సండైకోళి-2లో ఈ భామ ఉంటుందట. నాయకిగా మాత్రం కాదని సమాచారం. ఇలాంటి పరిస్థితిలో తాజాగా ఈ చిత్రానికి నాయకి నిర్ణయం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అదెవోరో కాదు. చిత్ర చిత్రానికి తన స్థాయిని పెంచుకుంటున్న స్మైల్ నటి కీర్తీసురేశ్‌నే ఆ అవకాశం వరించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

కీర్తీ ప్రస్తుతం ఇళయదళపతి విజయ్‌తో భైరవా చిత్రంలో నటిస్తున్నారు. బాబీసింహకు జంటగా నటించిన పాంబుసట్టై చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా త్వరలో మరో స్టార్ హీరో సూర్యతో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు. తానాసేర్న్‌ద కూటం పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నయనతార ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేష్ శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనుంది. కాగా తాజాగా సండైకోళి-2 చిత్రంలో విశాల్‌తో డ్యూయెట్స్ పాడటానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇకపోతే వచ్చే ఏడాది లింగుసామి దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా నటించనున్న చిత్రంలోనూ కీర్తీసురేశ్‌నే హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది.