కష్టాల్లో హీరోలు

5 Nov, 2018 06:50 IST|Sakshi
అర్జున్‌ సర్జా, దునియా విజయ్‌

వెండి తెరపై సాహసోపేతంగా పోరాటాలు చేసి అభిమానులను మైమరిపించే ఇద్దరు సినీ హీరోలు నిజజీవితంలో కేసుల సుడిలో చిక్కుకున్నారు. మీ టూ కేసులో అర్జున్‌ సర్జా, కూతురు ఫిర్యాదు చేయడంతో దునియా విజయ్‌లకు తాఖీదులందాయి. పోలీసుపై దాడి కేసులో దునియాపై కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైంది. సోమవారం కబ్బన్‌పార్క్‌ పీఎస్‌కు జెంటిల్మెన్‌ వస్తారా?, లేదా? అన్నది సస్పెన్స్‌.   

సాక్షి బెంగళూరు/ యశవంతపుర : చిత్రసీమలో సంచలనం సృష్టించిన మీ టూ లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రముఖ నటుడు అర్జున్‌ సర్జాపై నటి శ్రుతి హరిహరన్‌ దాఖలు చేసిన కేసు విచారణను కబ్బన్‌ పార్కు పోలీసులు ముమ్మరం చేశారు. అర్జున్‌ సర్జాకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని అందులో సూచించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కబ్బన్‌ పార్కు పోలీసు స్టేషన్‌పై కేంద్రీకృతమైంది.

అర్జున్‌ సోమవారం విచారణకు హాజరవుతారా?, లేదా అన్నది తెలియాల్సి ఉంది. రెండేళ్ల కిందట విస్మయ చిత్రం షూటింగ్‌ సమయంలో అర్జున్‌ తనపై లైంగికంగా వేధించారని శ్రుతి  రెండువారల కిందట ఆరోపించడం తెలిసిందే. ప్రముఖ నటుడు అంబరీష్‌ సహా సినీపెద్దలు రాజీ ప్రయత్నం చేసినా ఇద్దరూ మెట్టుదిగలేదు. శ్రుతి కబ్బన్‌ పార్కు పోలీసు స్టేషన్‌లో అర్జున్‌పై ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేశారు. శ్రుతి పేర్కొన్న సాక్షులను కూడా విచారించారు.  

దునియా విజయ్‌కు మహిళా కమిషన్‌ నోటీస్‌  
పానిపూరి కిట్టిపై దాడి, మొదటి భార్య, కూతురిపై దౌర్జన్యం తదితర కేసులతో సతమతమవుతున్న హీరో దునియా విజయ్‌కు మహిళ కమిషన్‌ నోటీసులను జారీ చేసింది. ఇటీవల మొదటి భార్య నాగరత్న, కూతురు మోనికాలతో విజయ్‌ గొడవ జరగడం తెలిసిందే. తనకు తండ్రి నుండి రక్షణ లేదని ఆరోపిస్తూ కూతురు మోనికా మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 12 లేదా 13న తమ ముందు హాజర్‌ కావాలని మహిళా కమిషన్‌ నోటీస్‌లో ఆదేశించింది. దునియా–మోనికా ఇద్దరిని ఒకచోట చేర్చి న్యాయ పంచాయితీ చేసే అవకాశం ఉంది.  

చార్జిషీటు దాఖలు  
దర్శకుడు సుందరగౌడను పోలీసులు అరెస్ట్‌ చేయటానికి వెళ్లగా దునియా విజయ్‌ పోలీసులకు ఆటంకం కలిగించిన కేసులో చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. తనను అడ్డుకుని దాడి చేశాడని హెడ్‌ కానిస్టేబుల్‌ గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌పై 65 పేజీల అభియోగపత్రాన్ని సమర్పించారు.   

మరిన్ని వార్తలు