11 దేశాల్లో సుందర్.సి సంఘమిత్ర

28 Jul, 2016 02:22 IST|Sakshi
11 దేశాల్లో సుందర్.సి సంఘమిత్ర

నటన, దర్శకత్వం అంటూ మార్చిమార్చి విజయాలను అందుకుంటున్న దర్శక నటుడు సుందర్.సి. ఈయన తాజాగా ఒక భారీ చారిత్రక కథా చిత్రాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ శత చిత్రంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంఘమిత్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో హీరో పాత్రలకు సూర్య, విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వంటి నటుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
 
 అయితే ఆ స్టార్ నటులనెవరినీ తాము సంప్రదించలేదని దర్శకుడు సుందర్.సి స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ ఫ్లేవర్‌తో రూపొందించనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, చాయాగ్రాహకుడు సుదీప్ చటర్జీ, కళా దర్శకుడు సాబు శిరిల్, సీజీ గ్రాఫిక్స్‌కు కమలకన్నన్ లాంటి సాంకేతిక నిపుణులు అవసరం అయ్యారని తెలిపారు. ఈ చిత్ర కథ పలు దేశాలల్లో నడుస్తోందన్నారు. ఆ గ్రాండీయర్ కోసం పైన చెప్పిన సాంకేతిక వర్గం పని చేయనున్నారని చెప్పారు. అయితే ఇంకా నటవర్గాన్ని ఎంపిక చేయలేదని తెలిపారు.
 
 కథకు తగ్గ ప్రముఖ నటీనటులే ఉంటారని అన్నారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని చెప్పారు. కాన్సెప్ట్ డిజైనింగ్ ప్రాసస్ జరుగుతోందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఇండియా, అమెరికా, డెన్మార్క్, ఉక్రెయిన్, ఇరాన్ తదితర 11 దేశాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం.