‘సంజు’కు భారీ షాక్‌...

29 Jun, 2018 16:09 IST|Sakshi

సంజయ్‌ దత్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ చిత్రం బాక్సాఫీస్‌ల వద్ద కలేక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా కేవలం ఒక్క భాషలోనే 4000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ సినిమాకు ఇంతలోనే భారీ షాక్‌ తగిలింది. పైరసీ భూతం సంజు సినిమానూ వదల్లేదు. ప్రస్తుతం ‘సంజు’ పైరసీ కాపీ, అది కూడా హెచ్‌డీ ప్రింట్‌ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. అది కూడా పూర్తి నిడివి చిత్రం కావడం గమనార్హం.

ఇది గమనించిన సోషల్‌ మీడియా యూజర్లు ఆ వెబ్‌సైట్‌ లింక్‌ను స్క్రీన్‌ షాట్స్‌ తీసి ఇంటర్నెట్‌లో షేర్‌  చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. సినిమా లీక్‌ అయిన విషయం తెలుసుకున్న రణ్‌బీర్‌ కపూర్‌ అభిమానులు మాత్రం ఈ విషయం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ‘నిజమైనా సిని అభిమానులు ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రోత్సాహించరు. వారు థియేటర్‌కి వెళ్లి, టిక్కెట్‌ కొని సినిమా చూస్తార’ని ప్రచారం చేస్తున్నారు.

మరికొందరు అభిమానులు ‘సంజు లీక్‌ అయ్యింది. దయచేసి ఈ లింక్‌లను ఎవరికీ షేర్‌​ చేయకండి’ అంటూ రణ్‌బీర్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఈ విషయం గురించి సీబీఎఫ్‌సీని విమర్శిస్తున్నారు. గతంలో సంజు సినిమాలోని టాయిలెట్‌ దృశ్యాలు విడుదలయినప్పడు సీబీఎఫ్‌సీ నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఉటంకిస్తూ ‘టాయిలెట్‌ సీన్లు విడుదలైతే దేశ గౌరవాన్ని కించపరిచామని వాదించిన వారు ఇప్పుడు సినిమా మొత్తం లీక్‌ అయింది. అయినా ఎందుకు  మాట్లడటం లేదు’ అని విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు