శంకరాభరణానికి చాగంటి ప్రవచన గౌరవం

5 Aug, 2015 00:24 IST|Sakshi
శంకరాభరణానికి చాగంటి ప్రవచన గౌరవం

ఎనభై మూడేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ‘శంకరాభరణం’ ఒక ప్రత్యేక చరిత్ర. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పద్మా సుబ్రహ్మణ్యం లాంటి సుప్రసిద్ధ సంగీత, నృత్య విద్వన్మణుల మొదలు రాజ్‌కపూర్ లాంటి సినీ దిగ్గజాల దాకా అందరినీ ఆకట్టుకున్న ఆ కళాఖండం విడుదలై (1980 ఫిబ్రవరి 4) ఇది 36వ సంవత్సరం. ఈ వెండితెర కావ్యంలోని సంగీత, సాహిత్య అంతరార్థాలు నిజంగానే కావ్యగౌరవాన్ని సంతరించు కొంటున్న ప్రత్యేక సందర్భం ఇప్పుడు ఎదురవుతోంది.
 
 ఒక సినిమాపై ఒక సరస్వతీపుత్రుడు మొట్టమెదటిసారిగా ప్రవచన రూపంలో విశ్లేషణ చేయనున్నారు. కాకినాడకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆగస్టు 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని శ్రీసత్య సాయి నిగమాగమంలో సాయంత్రం 6 గంటలకు ఈ విశ్లేషణ ప్రవచనం సాగనుంది. ‘మూడు పుష్కరాల (36 ఏళ్ళ) సామ గాన సౌరభం - శంకరాభరణం’ శీర్షికన జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను ‘శంకరాభరణం’ దర్శకులు కె. విశ్వనాథ్, కార్యక్రమ నిర్వాహకులైన  శ్రీనివాస్, శ్రీధర్‌లు మంగళవారం వివరించారు.
 
 మంగళంపల్లికి గురుపూజ
 ‘‘సుందరకాండ, రామాయణ, భారతాల లాగా గురుశిష్య సంబంధమైన ‘శంకరాభరణం’ గురించి ఒక సప్తాహం చేయగలనని పదేళ్ళ క్రితమే చాగంటి గారు నాతో అన్నారు. ఆ ప్రశంస నాకు ‘భారత రత్న’, ‘పద్మవిభూ షణ్’లను మించినది. అప్పటి ఆ మాటను ఆయనిప్పుడు నిజం చేస్తున్నారు. ఈ ప్రవచన రూప విశ్లేషణతో ఒక సినిమాకు అచ్చమైన కావ్యగౌరవం ప్రసాదిస్తున్నారు’’ అని విశ్వనాథ్ పేర్కొన్నారు. కార్యక్రమం చివరి రోజున చాగంటి గారు తన గురువులైన మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్‌ను సత్కరిస్తే, గాయకులు డి.వి. మోహనకృష్ణ తన గురువైన మంగళంపల్లి బాలమురళీకృష్ణను సభక్తికంగా గౌరవించనున్నారు.
 
 త్రిపుష్కరోత్సవ ప్రత్యేక గీతం... నృత్యం...
 ఈ సందర్భంగా ‘శంకరాభరణం త్రిపుష్కరోత్సవ గీతం’ పేరిట రచయిత రాంభట్ల నృసింహశర్మ ప్రత్యేకంగా పాట రాయడం విశేషం. సినీ గాయకుడు ఎన్.వి. పార్థసారథి సంగీతం అందించి, శ్రీమతి తేజస్వినితో కలసి పాడారు. కాకినాడకు చెందిన నర్తకి వీణ ఆ గీతానికి నృత్యం చేయ నున్నారు.
 
 విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇప్పటికే ప్రపంచమంతటా అందరూ గౌరవించడం ‘శంకరాభరణం’కు దక్కిన అమ్మ ఆశీర్వాదం లాంటిదైతే, ఇప్పుడీ చాగంటి వారి ప్రవచనం పండితుల ఆశీర్వాదం లాంటిదని విశ్వనాథ్ అన్నారు. మొదటి ఆశీర్వాదం ఈ సినిమాకు ఎప్పుడో దక్కినా, ఇప్పుడీ రెండో ఆశీర్వాదం అంతకు మించినదని అభిప్రాయ పడ్డారు. ‘సాగరసంగమం’, ‘స్వర్ణ కమలం’ లాంటి ఇతర సినీ కావ్యాలపై కూడా సమగ్రమైన విశ్లేషణ జరిగితే, మరింత మందికి వాటిలోని అంతరార్థాలు తెలియవచ్చని ఆయన వ్యాఖ్యా నించారు.