పండక్కి ట్రిపుల్‌ ధమాకా

13 Jan, 2019 00:34 IST|Sakshi
విద్యాబాలన్, బాలకృష్ణ

సంక్రాంతి పండక్కి సినిమాలొస్తాయి. థియేటర్స్‌కి ఆడియన్స్‌ వస్తారు. ఆకాశంలో గాలిపటాల కంటే స్టార్స్‌ ఎక్కువ కనపడతారు. రంగుల ముగ్గుల కంటే థియేటర్లో రంగుల కాగితాలు ఎక్కువ ఎగురుతాయి. ఇక స్వీట్ల పంపకాలు, వేడుకలు, డ్యాన్సులు... థియేటర్ల బయట బోలెడంత హంగామా. సంక్రాంతికి ట్రిపుల్‌ ధమాకాలా వచ్చిన మూడు స్ట్రయిట్‌ ‘ఫ్యాన్‌.... టాస్టిక్‌’  సినిమాల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

సంక్రాంతి సీజన్‌లో ముందుగా వచ్చిన సినిమా ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు’. నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. క్రిష్‌ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మాతలు. ‘‘ట్రేడ్‌ పరంగా బుధవారం రిలీజ్‌ అంటే అంత మంచిది కాదు. కానీ ఎన్టీఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి విడుదలకు ఆ రోజుని ఎంపిక చేసుకున్నాం’’ అని దర్శకుడు క్రిష్‌ అన్నారు. ఈ చిత్రం వసూళ్ల విషయానికొస్తే... 700 థియేటర్లలో రిలీజైన ‘యన్‌.టి.ఆర్‌’ తొలి రోజు 10 కోట్ల పై చిలుకు షేర్‌ చేసిందని, బుధవారం అయినప్పటికీ ఇంత వసూలు చేయడం మామూలు విషయం కాదని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

‘యన్‌.టి.ఆర్‌’ రిలీజ్‌ తర్వాత ఒక్క రోజు గ్యాప్‌ (11న విడుదల)తో ‘వినయ విధేయ రామ’ తెరపైకి వచ్చింది. రామ్‌చరణ్‌ హీరోగా డీవీవీ దానయ్య నిర్మించారు. బోయపాటి మార్క్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరపైకొచ్చింది. దాదాపు 900 థియేటర్లకు పైగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు 30 కోట్ల షేర్‌ రాబట్టిందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’ అంటూ వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ వీకెండ్‌లో సందడి చేయడానికి థియేటర్లోకి వచ్చారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం శనివారం తెరకొచ్చింది. ‘‘మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా కూడా హిట్టే’’ అని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.

స్ట్రయిట్‌ చిత్రాల మధ్య వచ్చిన డబ్బింగ్‌ మూవీ ‘పేట’. రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ సినిమాని తెలుగులో అశోక్‌ వల్లభనేని విడుదల చేశారు. మూడు స్ట్రయిట్‌ చిత్రాల మధ్య రావడంతో థియేటర్లు పెద్దగా దొరకలేదు. రజనీ మార్క్‌ మాస్‌ మూవీ అనిపించుకుని, ప్రేక్షకులను థియేటర్స్‌కి రాబట్టుకుంటోందని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.


 కియారా, రామ్‌చరణ్‌


 వెంకటేశ్, తమన్నా, మెహరీన్, వరుణ్‌ తేజ్‌


 రజనీకాంత్, త్రిష

మరిన్ని వార్తలు