ఆ నమ్మకంతోనే సినిమా తీశాం: రవికిరణ్‌

10 Dec, 2017 02:53 IST|Sakshi
చరణ్‌ లక్కాకుల, సప్తగిరి, కశిష్‌ వోహ్రా, రవికిరణ్‌

సప్తగిరి, కశిష్‌ వోహ్రా జంటగా చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి పతాకంపై రవికిరణ్‌ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’. గురువారం విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘రైతులు బతకాలి, అందరికీ న్యాయం దక్కాలన్న కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి విజయం అందించారు. సాయికుమార్, శివప్రసాద్‌లకు దీటుగా సప్తగిరి నటించాడు.

మా చరణ్‌ ఈ సినిమాతో దర్శకునిగా సక్సెస్‌ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సప్తగిరిలో మంచి ఎనర్జీ ఉంది. మా శిష్యుడు చరణ్‌ ఈ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వర రావు. ‘‘పరుచూరి బ్రదర్స్‌గారే ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం. నాకు దర్శకుడు చరణ్‌ గొప్ప సినిమా ఇచ్చారు. ఇది ఆయన విజయం. ఇంత మంచి సినిమాను నాతో చేయించిన నిర్మాత రవికిరణ్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమా సక్సెస్‌ కావడంతో పెద్ద డైరెక్టర్స్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయి’’ అన్నారు హీరో సప్తగిరి.

‘‘ కంటెంట్‌ని నమ్ముకుని సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ సినిమా తీశాం. రైతులు, లాయర్లు ఎంతోమంది సినిమా చూసి అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు నేచురల్‌గా నటించారు. మంచి సినిమా నిర్మించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు రవికిరణ్‌. ‘‘మాస్‌ హీరోలో ఉండే క్వాలిటీస్‌ అన్నీ సప్తగిరిలో ఉన్నాయి. పరుచూరి బ్రదర్స్‌ మంచి డైలాగ్స్‌ రాశారు. సినిమా బాగుందని అందరూ అభినందిస్తుంటే పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నాను. సాయికుమార్, శివప్రసాద్, సప్తగిరి బాగా నటించారు’’ అన్నారు చరణ్‌ లక్కాకుల. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు